సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది! ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

ప్రస్తుత వేసవి సీజన్ ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇన్ని రోజులు శీతాకాలం సీజన్లో చలిని ఎంజాయ్ చేసిన మనం ఇక నుంచి వానాకాలం సీజన్ వరకు ఎండ వేడితో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కడంతో దానికి అనుగుణంగా శరీర జీవ క్రియలు మార్పు చెందే క్రమంలో కొన్ని అనారోగ్య ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో సూర్య తాపం నుంచి మన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి కొన్ని సులువైన చిట్కాలను పాటించవచ్చు.

ఈ సమ్మర్ సీజన్ లో మన శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవాలంటే కొన్ని ఆహార నియమాలను పాటించడంతోపాటు నీళ్లను తరచూ తాగుతూ ఉండాలి. నిపుణుల సూచన ప్రకారం రోజుకు ఐదు లీటర్ల కంటే తక్కువ నీటిని తాగితే శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి దాహం లేకపోయినా అప్పుడప్పుడు గ్లాసులు నీళ్ళను తాగుతూ ఉండాలి. అలాగే మనం తీసుకునే ఆహారం సులువుగా జీర్ణం అయ్యే విధంగా ఉండి అధిక వాటర్ కంటెంట్ కలిగి ఉండాలి. ప్రతిరోజు ఉదయాన్నే అధిక మినరల్స్ కలిగిన వాటర్ మిలన్, కర్బూజా, కొబ్బరినీళ్లు, నిమ్మరసాన్ని , తాటి ముంజలను ఆహారంగా తీసుకోవడంతో పాటు వీటి జ్యూస్ సేవిస్తే మన శరీరానికి కావాల్సిన లవణాలు సమృద్ధిగా లభించి రోజు మొత్తం శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు

ఎండాకాలంలో మధ్యాహ్నం సమయంలో సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది.ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, హెల్మెట్లను ఉపయోగించడంతోపాటు చర్మం పొడిబారకుండా సన్ స్క్రీన్ వాడాలి, కళ్ళు పొడివాడకుండా సన్ గ్లాసెస్ ఉపయోగిస్తే మంచిది. ఈ వేసవి సీజన్ మొత్తం బిగుతుగా ఉండే దుస్తులను ధరించడానికి బదులు లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం మంచిది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలు కొంతవరకు క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇక చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలను పదేపదే ఎండకు తిరగనివ్వకూడదు.
చిన్నపిల్లలు విశ్రాంతి తీసుకునే గది ఎల్లప్పుడు చల్లగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.