ప్రస్తుత కాలంలో అప్పు చేయని వాళ్లు, అప్పు లేని వాళ్లు దాదాపుగా ఉండరు. ఎక్కడా అప్పు లేకపోయినా కనీసం బ్యాంకులో అయినా చాలామందికి అప్పు ఉంటుంది. ఎవరి స్థాయికి అనుగుణంగా వాళ్లు అప్పులు చేస్తుంటారు. కొంతమంది బ్యాంకులలో తక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకుని ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయనే సంగతి తెలిసిందే.
అయితే అప్పుల బాధలను తీర్చే ఆలయం ఒకటి ఉందని చాలామందికి తెలియదు. గుబులు వెంకన్న దేవాలయాన్ని దర్శించుకుని అక్కడ ఉండే అఖండ దీపంలో నూనె పోసి దీపం వెలిగిస్తే అప్పులు తీరతాయని చాలామంది ఫీలవుతారు. హైదరాబాద్ వరంగల్ హైవేపై చిల్పూరు గుట్టలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో దేవుడిని దర్శించుకోవడం ద్వారా కచ్చితంగా అప్పుల బాధలు తీరతాయి.
ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం రోజున స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. వివాహం కోసం కుబేరుడి వద్ద వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుండి బయట పడటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నారని స్థానికులు చెబుతారు. కుబేరుని అప్పుని తీర్చలేక వేంకటేశ్వర స్వామివారు చింతతో, దిగులుతో చిల్పూరు గుట్టకు వచ్చారని స్థల పురాణం సైతం చెబుతోంది.
చింత, దిగులు ఉన్నవాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అన్ని కష్టాలు తీరడంతో పాటు ప్రశాంతత సొంతమవుతుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి అఖండ దీపంలో నూనే వేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి రుణబాధలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.