జాతకంలో ఏలినాటి శని ఉందని భయపడుతున్నారా.. ఈ పరిహారాలు పాటిస్తే మంచిదంటూ?

మనలో చాలామంది ఏలినాటి శని గురించి వింటే భయాందోళనకు గురవుతారు. జాతకంలో ఏలినాటి శని ఉంటే అనుకూల ఫలితాలు రావని చాలామంది భావిస్తారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో 30 సంవత్సరాల కాలంలో ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని ఉంటుంది. 100 సంవత్సరాలు జీవించే ఒక మనిషి జీవితంలో ఏకంగా 19 సంవత్సరాల పాటు ఏలినాటి శని ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు.

అయితే ఏలినాటి శని ఉందని కంగారు పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. శని ఆయుః కారకుడు కాగా ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్నిసార్లు మనం చేయాల్సిన పనులు అనుకున్న సమయం కంటే ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప అసలు జరగకుండా ఉండవు. పెళ్లిళ్లు, పదోన్నతులపై ఏలినాటి శని ప్రభావం ఏ మాత్రం ఉండదని పండితులు చెబుతున్నారు. శుభకార్యాలకు సంబంధించి ఆటంకాలు ఉంటే ఇతర గ్రహాల ప్రభావం కారణమవుతుంది.

శనివారం రోజున నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు కట్టి శనీశ్వరునికి దీపారాధన చేయడంతో పాటు 19 ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాలకు తొమ్మిదిసార్లు ప్రదక్షిణ చేయడంతో పాటు నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపం వెలిగించినా శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా తొమ్మిది వారాలు చేయడం వల్ల దోషాలు, కష్టనష్టాలు దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఇనుముతో శని విగ్రహంను చేయించి మట్టికుండ లేదా ఇనుప పాత్రలో ఆ విగ్రహాన్ని ఉంచడం ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయి. శనీశ్వరునికి నల్లని వస్త్రం కప్పి గంధంతో పూజించి పులగం, నువ్వులు మరికొన్ని వస్తువులు దానం చేస్తే మంచిది. దానాలు, ధర్మాలు, ప్రదక్షిణలు చేసేవాళ్లపై శని ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.