దక్షిణాయణ పుణ్యకాలానికి వీడ్కోలు పలుకుతూ.. ఉత్తరాయణానికి స్వాగతం పలికే పవిత్ర సంధికాలమే ధనుర్మాసం. భక్తి, నియమం, ఆరాధనలతో నిండిన ఈ విశిష్ట మాసం 2025 డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14 వరకు కొనసాగనుంది. శ్రీమహావిష్ణువు ఆరాధనకు అతి ముఖ్యమైన ఈ నెల రోజులు, ఆధ్యాత్మికంగా ప్రత్యేక శక్తిని కలిగిన కాలంగా పండితులు పేర్కొంటున్నారు.
మార్గశిర మాసంలో ప్రారంభమై పుష్య మాస ప్రవేశంతో ముగిసే ఈ ధనుర్మాసాన్ని ఉత్తర భారతదేశంలో ‘ఖర్మాస్’గా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది తరతరాలుగా ధనుర్మాసంగా ప్రసిద్ధి చెందింది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం శనిగ్రహ ప్రభావంతో ముడిపడి ఉన్న ఈ మాసం, భౌతిక కార్యక్రమాలకన్నా భక్తి మార్గానికే అనుకూలమైన సమయంగా భావిస్తారు.
ఈ నెలరోజులూ విష్ణు ఆలయాలు భక్తిశ్రద్ధలతో కళకళలాడతాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం వినిపిస్తుంది. గోదాదేవి (ఆండాళ్ అమ్మవారు) సేవలు, తిరుప్పావై పారాయణాలు, గోదాదేవి కళ్యాణోత్సవం వంటి ద్రవిడ సంప్రదాయాలు ఈ మాసానికి ప్రత్యేక ఆకర్షణ. సహస్రనామార్చనలో తులసి స్థానంలో బిల్వపత్రాలతో పూజలు చేయడం కూడా ఈ నెల ప్రత్యేకతగా చెబుతారు.
ధనుర్మాసంలో వేకువజామున శ్రీమహావిష్ణువును ఆరాధించడం అత్యంత పుణ్యప్రదమని విశ్వాసం. చాలామంది ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, నామస్మరణ, దీపారాధన వంటి నియమాలను కఠినంగా పాటిస్తారు. అయితే ఈ మాసంలో శుభకార్యాలకు మాత్రం విరామం ఇవ్వాలని పండితుల సూచన. గ్రహగతుల ప్రభావం కారణంగా ధనుర్మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, నామకరణం (బారసాల) వంటి శుభకార్యాలు నిర్వహించరు. అలాగే కొత్త వాహనాల కొనుగోలు, ఆస్తి లావాదేవీలు, బంగారం–వెండి వంటి విలువైన వస్తువుల కొనుగోళ్లు కూడా సాధ్యమైనంతవరకు వాయిదా వేయాలని సూచిస్తారు. ఈ సమయంలో సూర్యుడి ప్రభావం కాస్త తగ్గిపోవడం వల్ల శుభకార్యాలకు విఘ్నాలు కలగవచ్చని పూర్వీకుల నమ్మకం.
ఇదిలా ఉండగా, ధనుర్మాసం ముగిసిన తర్వాత కూడా 2026 ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి కొనసాగనుంది. అంటే మాఘమాస బహుళ అమావాస్య వరకు శుభకార్యాలకు పూర్తి అనుకూలత ఉండదని పండితులు చెబుతున్నారు. అందుకే 2026 కొత్త సంవత్సరంలో మాఘమాసం వచ్చేవరకు వివాహాది శుభకార్యాలకు బ్రేక్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయా ప్రాంతాల సంప్రదాయాల ప్రకారం కొన్ని విషయాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని కూడా చెబుతున్నారు.
భౌతిక పరుగుల నుంచి కాస్త విరామం తీసుకుని… భక్తి, నియమం, ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించుకునే అరుదైన అవకాశమే ఈ ధనుర్మాసం అని పండితులు అంటున్నారు.
