Biscuit Packet: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. టిఫిన్, భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, ఇంట్లో టీవీ, వంటింట్లో ఫ్రిజ్, బాత్ రూమ్ లో గ్రీజర్, బెడ్ రూమ్ లో మంచం, హాల్లో టీవీ.. చివరికి చీపురు కట్టలు కూడా ఆన్ లైన్లోనే. ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం.. నిముషాలు, గంటలు, రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఇల్లు కదలకుండా దక్కే ఇటువంటి సౌకర్యాన్ని ఎవరు మాత్రం కాదంటారు. అయితే.. ఆర్డర్ ఇచ్చిన వస్తువు కాకుండా వేరే వస్తువు వస్తేనే.. ఇబ్బంది. చాలామంది ఇలా మోసపోయారు కూడా. ఇలానే జరిగిందా వ్యక్తికి. ఆన్ లైన్లో ఆర్డరిచ్చింది ఒకటి.. ఇంటికి వచ్చింది మరొకటి. ఆశ్చర్యపోయాడు. అయితే.. కొత్తగా రియాక్టయ్యాడు.. అదే ఇక్కడ హైలైట్. అసలేం జరిగిందంటే..
అమెజాన్ ఇండియాలో రిమోట్ కంట్రోల్ కారు ఆర్డర్ పెట్టాడో వ్యక్తి. రోజుల్లో ప్యాకింగ్ రానే వచ్చింది. సంతోషంగా ఓపెన్ చేశాడు. కానీ.. ప్యాక్ ఓపెన్ చేసి.. అందులో ఉన్న వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. రిమోట్ కంట్రోల్ కారు బదులుగా.. ‘పార్లే-జీ’ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. ఒక్క క్షణం ఏం అర్ధం కాలేదు. ఎంతో నమ్మదగిన సంస్థ కదా అని ఆర్డర్ ఇస్తే.. ఇంతలా చీట్ చేస్తారా? వినియోగదారుల ఫోరంలో కేసు పెడతా.. మీ సంగతి చూస్తా? నా విలువైన టైమ్ ని వేస్ట్ చేస్తారా? అని మాత్రం ఊగిపోలేదు. కామ్ గా.. కూల్ కూల్ గా ఓ నవ్వు నవ్వుకున్నాడు. కంప్లైంట్ పెట్టదలచుకోలేదు. చక్కగా చాయ్ చేసుకుని.. అందులో బిస్కెట్ ను నంజుకుని తిన్నాడు.
ఈ వ్యవహారంలో కంపెనీ వాళ్లు రాంగ్ ప్యాకింగ్ పంపించడం కాదు కానీ.. ఇక్కడ ఈ వ్యక్తి ఇంత సెన్సాఫ్ హ్యూమర్ తో ఆలోచించి.. విషయాన్ని తేలిగ్గా తీసుకోవడమే హైలైట్ అయింది. తనకు జరిగిన అనుభవాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు సరదాగా.. ‘స్నాక్స్ వచ్చాయి సంతోషం.. ఇటుక రాలేదు..’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే.. విషయం అమెజాన్ కు వివరించగా డబ్బు తిరిగిచ్చేందుకు ఒప్పుకుందని కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో బాగా వైరల్ అయింది.