భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ప్రజలు వారు సంపాదించిన మొత్తంలో కొంత డబ్బు భవిష్యత్తు కోసం బ్యాంకులలో పొదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్బీఐ రేఫో రేటును పెంచిన తర్వాత..చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలపై వడ్డీని పెంచాయి. కొన్ని బ్యాంకులలో సేవింగ్స్ అకౌంట్ పై అధిక వడ్డీ అందిస్తుంటే.. మరికొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లకు సమానమైన వడ్డీని అందిస్తున్నాయి. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే పొదుపు ఖాతాలపై సీనియర్ సిటిజన్లకు అయితే అధిక వడ్డీ ఆప్షన్ లేదు. సేవింగ్స్ అకౌంట్ పై అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• ఎస్బీఐ :
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ రూ.10 కోట్ల వరకు డిపాజిట్లపై 2.70 శాతం వడ్డీని, సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై 3 శాతం వడ్డీని అందిస్తోంది.
• ఐసీఐసీఐ బ్యాంక్:
ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 50 లక్షల వరకు ఉన్న పొదుపు డిపాజిట్ల మీద 3% వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో, రూ. 50 లక్షల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద 3.50 శాతం వడ్డీ అందుతుంది.
• హెచ్డీఎఫ్సీ:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పొదుపు ఖాతాలో రూ. 50 లక్షల కంటే తక్కువ డిపాజిట్లపై 3 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అలాగే రూ. 50 లక్షల కన్న ఎక్కువ ఉన్న డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీని చెల్లిస్తుంది.
• కెనరా బ్యాంక్:
కెనరా బ్యాంక్ లో వివిధ పొదుపు మొత్తాల మీద 2.90 శాతం నుంచి 4 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. అలాగే రూ.2000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద అధికంగా 4 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
• యూనియన్ బ్యాంక్:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ పొదుపు మోత్చాల మీద వివిధ వడ్డీ రేట్లు ఉన్నాయి. రూ. 50 లక్షల డిపాజిట్ల మీద 2.75 శాతం, రూ. 50 లక్షల నుంచి 100 కోట్ల వరకు డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ ఇస్తోంది. ఇక రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద 3.10 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 500 కోట్లకు పైగా ఉన్న డిపాజిట్ల మీద వార్షిక వడ్డీగా 3.40 శాతం చెల్లిస్తోంది.
• పంజాబ్ నేషనల్ బ్యాంక్:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 10 లక్షల వరకు విలువైన డిపాజిట్ల మీద 2.70 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న డిపాజిట్ల మీద 2.75 శాతం వడ్డీ అందిస్తోంది. అలాగే రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న డిపాజిట్ల మీద 3 శాతం వడ్డీ అందిస్తోంది.