శబరిమల లోని అయ్యప్ప క్షేత్రంలో ఒక సినీ నటుడికి విఐపి దర్శనం కల్పించడం పట్ల కేరళ హైకోర్టు ట్రావెల్ కోర్ సంస్థానంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఎలా విఐపి దర్శనం కల్పిస్తారంటూ ట్రావెన్ కోర్ సంస్థానంపై అక్షింతలు వేసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ గురువారం శబరిమల లో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆయనకి ట్రావెన్ కోర్ వీఐపీ దర్శనం ఏర్పాటు చేసింది.
ఆ సమయంలో భక్తులు చాలా సేపు క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. చాలామంది దర్శనం చేసుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోయారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలు ఆధారంగా హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించింది. ఒక నటుడిని అంతసేపు ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతించారు, ఆయన వల్ల పిల్లలు, వృద్దులు ఇబ్బంది పడినట్లు పేర్కొంది. ఆలయ యాజమాన్యం ఇలా ప్రవర్తిస్తే భక్తులు ఎవరికి ఫిర్యాదు చేస్తారని నిలదీసింది.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే విఐపి దర్శనం ఉంటుందని, ఇతరులకు అవకాశం కల్పించడం నిబంధనలకు విరుద్ధమని, ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టి శనివారంలోగా వీడియో ఫుటేజీ నివేదికను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తులు నరేంద్రన్, జస్టిస్ మురళీకృష్ణ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా నటుడిని ప్రతివాదిగా చేర్చాలని వస్తున్న డిమాండ్లను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఒక నటుడికి అంత ప్రాధాన్యత ఎలా ఇచ్చారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని డివిజన్ బెంజ్ పోలీసులని కోరింది.
అంతేకాదు హరివరాసనం (అయ్యప్ప స్వామికి లాలిపాట ) అంతటా సోపానం ముందు రోజంతా ఆలయం మూసి వేసే వరకు నటుడు దిలీప్ ముందు వరుసలో నిలబడి ఉన్నారని బెంచ్ తెలిపింది. దిలీప్ పర్యటన వలన భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారని, త్రోపులాట అయిందని దిలీప్ తో పాటు అలప్పుజ జిల్లా జడ్జి కేకే రాధాకృష్ణన్, నారక ఇన్చార్జి కె.పి అనిల్ కుమార్ కూడా విఐపి ప్రవేశం ద్వారా మందిరానికి వచ్చినట్లు నివేదిక పేర్కొంది. దీనిపై ట్రావెన్ కోర్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.