రాజకీయాల్లో పార్టీ మారడం కొత్త విషయం కాదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, రాజకీయ ఒత్తిడుల కారణంగానో, కొన్ని సందర్భాల్లో కేసుల నుంచి తప్పించుకునేందుకో నేతలు వేరే పార్టీల్లో చేరడం సాధారణమే. అయితే, పార్టీ ఫిరాయింపు విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పదవిని అలానే కొనసాగించుకొని వేరే పార్టీలో చేరడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని కోర్టు స్పష్టం చేసింది. పార్టీ మారాలనుకుంటే ముందుగా పదవికి రాజీనామా చేసి, తర్వాత ఎన్నికల ద్వారా ప్రజల తీర్పు పొందాలని సూచించింది.
ప్రజలు ఒక పార్టీకి మద్దతుగా ఓటు వేసి గెలిపిస్తే, ఆతర్వాత ఆయా ప్రజా ప్రతినిధులు వేరే పార్టీలో చేరటం ప్రజా తీర్పును అవమానించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ మారిన నేతలు, తిరిగి ప్రజల్లోకి వెళ్లి తమ నైతికతను నిరూపించుకోవాలని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన నిర్ణయాధికారులు కాబట్టి, ఫిరాయింపుదారులను గెలిపించాలో, ఓడించాలో వారు నిర్ణయిస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యలు ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం చేసింది. ప్రజల ఓటు ద్వారా గెలిచిన వ్యక్తి, ఆ పార్టీ మారాలనుకుంటే తన పదవికి రాజీనామా చేసి కొత్త ఎన్నికల్లో గెలవాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేలా ఇలాంటి నిర్ణయాలు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాజకీయ నాయకులు తమ వేర్వేరు కారణాలతో పార్టీలు మారుతున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఓటమికి భయపడకుండా, రాజీనామా చేసి తిరిగి ప్రజల ముందుకు రావాలనే హైకోర్టు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ తీర్పు తర్వాత రాజకీయ నాయకుల ఫిరాయింపుల తీరుపై ప్రజలు మరింత అవగాహనతో వ్యహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

