అమెరికాలో జ‌య‌ల‌లిత‌ బ‌యోపిక్ లుక్ టెస్ట్

అభిమానుల కోసం ఆయ‌న్ని అలా క‌ట్ చేస్తారా?
బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ వివాదాల‌తో ఎంత బిజీగా ఉంటుందో వ‌రుస సినిమాల‌తో  అంతే బిజీబిజీగా ఉంటుంది. మ‌ణిక‌ర్ణిక, జ‌డ్జిమెంట‌ల్ హై క్యా చిత్రాల‌ స‌క్సెస్ అనంత‌రం వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంది. అందులో దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఎంతో ఆస‌క్తిని పెంచుతోంది. 
 
ఒక అగ్ర‌క‌థానాయిక‌గా .. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా.. పేదల పాలిట అమ్మ‌గా జ‌య‌ల‌లిత సుప‌రిచితం. ఆరుసార్లు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల్ని పాలించారు. అందుకే అమ్మ బ‌యోపిక్ ని ప్ర‌క‌టించ‌గానే స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కంగ‌న ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు. ఏ.ఎల్.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఆర్.క‌మ‌లేష్ తో క‌లిసి తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి అనంత‌రం సినిమాని ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
తాజా స‌మాచారం ప్ర‌కారం… కంగ‌న లుక్ టెస్ట్ కోసం అమెరికా లాస్ ఏంజెల్స్ బ‌య‌ల్దేరార‌ని తెలుస్తోంది. అక్క‌డ ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ స్పెష‌లిస్ట్ జాస‌న్ కొలిన్స్  సార‌థ్యంలో ర‌క‌ర‌కాల లుక్ టెస్టులు చేయ‌నున్నార‌ట‌. కెప్టెన్ మార్వ‌ల్, బ్లేడ్ ర‌న్నర్ 2049 వంటి భారీ చిత్రాల‌కు మేక‌ప్ అందించిన స్పెష‌లిస్ట్ ఆయ‌న‌. అందుకే అమ్మ పాత్ర‌కు పెర్ఫెక్ట్ డిజైన్ రూపొందిస్తార‌న్న న‌మ్మ‌కాన్ని ఇదివ‌ర‌కూ నిర్మాత విష్ణు ఇందూరి ఓ ఇంట‌ర్వ్యూలో వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం లుక్ ఎలా ఉంటుందో చెక్ చేసుకునే ప‌నిలో ఉంది క్వీన్. ఈ చిత్రంలో క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తార‌ని ప్ర‌చారం అవుతోంది. అలాగే ఈ చిత్రంలో ఎంతో ముఖ్య‌మైన‌ శ‌శిక‌ళ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. త‌దుప‌రి ఓ భారీ యాక్ష‌న్ సినిమాతో పాటుగా మ‌రిన్ని ప్రాజెక్టులు కంగ‌న క్యూలో ఉన్న సంగ‌తి తెలిసిందే.