అయ్యయ్యో… చివరికి మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి విజయ్ సేతుపతి తప్పుకునేలా చేసారుగా !

Actor Vijay Sethupathi Exits Muttiah Muralitharan Biopic

చెన్నై : ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ”800” అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వరల్డ్ క్రికెట్ లో తన బౌలింగ్ మాయాజాలంతో ఎంతోమంది స్టార్ బ్యాట్స్ మ్యాన్స్ కి దడపుట్టించిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కి ఇటీవలే ”800” అనే టైటిల్ ఖరారు చేసి మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ముత్తయ్య పాత్రలో కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించనున్నారని అతని లుక్ కూడా రిలీజ్ చేశారు. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో రూపొందనున్న ఈ బయోపిక్ ని ‘మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్’ మరియు ‘డార్ మోషన్ పిక్చర్స్’ బ్యానర్స్ పై వివేక్ రంగాచారి నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే మురళీధరన్ బయోపిక్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళులను అణచివేస్తున్నదని.. జాతి వివక్షను పాటించే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ జీవితాన్ని తెరపై చూపిస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన బయోపిక్ నుంచి వైదొలగాలని విజయ్ సేతుపతిని కోరుతూ మురళీధరన్ ఓ లేఖ విడుదల చేసాడు. తన లైఫ్ స్టోరీ చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుందని అనుకున్నానని.. కానీ ఇది పెద్ద వివాదంగా మారుతుందని ఊహించలేదని తన ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షా సమయాల్లో తనకు మద్దతుగా నిలిచినా విజయ్ సేతుపతి అభిమానులకు మీడియాకు మురళీధరన్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన తదుపరి సమాచారం త్వరలో నిర్మాతలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారని.. వారి ప్రయత్నాలకు అండగా నిలుస్తానని ముత్తయ్య తెలిపాడు.

”నా బయోపిక్ – 800 ఆధారంగా తమిళనాడులో వివాదం చెలరేగిన నేపథ్యంలో నేను ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను. నా చుట్టూ ఉన్న తప్పుడు భావనల కారణంగా నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి వైదొలగాలని కొందరు ఒత్తిడి తెస్తున్నారని నాకు తెలుసు. నా వల్ల తమిళనాడుకు చెందిన గొప్ప కళాకారుడు బాధపడాలని నేను కోరుకోను. దీని కారణంగా అతని కెరీర్ లో అనవసరమైన అడ్డంకులు కలుగకూడదు. అందుకే ఈ సినిమా నుండి తప్పుకోవాలని నేను అతనిని అభ్యర్థిస్తున్నాను” అని లేఖలో మురళీధరన్ పేర్కొన్నాడు. ఈ లేఖపై విజయ్ సేతుపతి స్పందిస్తూ.. ”థ్యాంక్యూ.. గుడ్ బై” అని ట్వీట్ చేసాడు. దీంతో మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు స్పష్టమైంది.