యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో హీరో శర్వానంద్ విలేఖరుల సమవేశంలో పాల్గొని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు.
ఒకే ఒక జీవితం విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
ఆనందంగా వుంది. సెన్సిబుల్ సినిమా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాకి కనెక్ట్ అవ్వాలని బలంగా అనుకున్నాం. మేము ఊహించినట్లే సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. దీంతో ఒక బరువు దిగిందనే భావన కలిగింది. అదే సమయంలో కొత్త చేయబోయే సినిమాల గురించి కొంత కంగారు మొదలైయింది(నవ్వుతూ).
టైం ట్రావెల్ అంటే రిస్క్ కదా.. ప్రేక్షకులు ఎలా సింక్ అవుతారని భావించారు ?
ప్రేక్షకుల కంటే విమర్శకులు ఎలా రియాక్ట్ అవుతారనే భయం వుండేది(నవ్వుతూ). ఇలాంటి కథల్లో లాజిక్కులు వెదకడం సులువు. అయితే లక్కీగా విమర్శకులకు కూడా సినిమా నచ్చింది. స్ట్రాంగ్ కంటెంట్ వుండటంతో అందరికీ నచ్చింది. దర్శకుడు హను అయితే ఈ సినిమా పిల్లలకి ఎక్కువ చూపించాలని చెప్పారు. పిల్లల కోసం ఒక స్పెషల్ షో వేశాం. చాలా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్. టైం ట్రావెల్ లో ఎక్కడికి వెళ్తారని అడిగితే ప్రజంట్ లోనే వుంటామని చెబుతున్నారు.
వాళ్ళంతా ముదుర్లు(నవ్వుతూ) వాళ్ళ లైఫ్ ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.
మీకు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్తారు ?
ఇంటర్ రోజులకి వెళ్తా. హ్యాపీ డేస్ అవి. రేపటి గురించి ఆలోచన, భవిష్యత్ గురించి చింత ఏమీ వుండేది కాదు. కాలేజ్ బంక్ కొట్టాలి, సినిమాకి వెళ్ళాలి, అటు నుండి దాబాకి వెళ్ళాలి. ఇదే ఆలోచన. నిజంగా గోల్డెన్ డేస్.
శ్రీకార్తిక్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
చాలా అద్భుతమైన దర్శకుడు. భవిష్యత్ లో చాలా పెద్ద దర్శకుడు అవుతాడు. కథని చాలా వివరంగా చెప్పాడు. అంత వివరంగా చెప్పాడు కాబట్టే ఈ కథపై, ఆయన ప్రతిభ పూర్తి నమ్మకం ఏర్పడింది. మంచి కథ కుదిరితే భవిష్యత్ తో తనతో కలసి మళ్ళీ పని చేస్తా. అయితే ఆయన బయట కూడా రెండు మూడు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
ఈ సినిమాకి రావల్సినంత ఆదరణ వచ్చిందని భావిస్తున్నారా ?
నిజానికి నేను ఏ సినిమాకి నెంబర్స్ ఎక్స్ పెక్ట్ చేయను. ప్రతిది పాజిటివ్ గా తీసుకుంటాను. ముఖ్యంగా ఒకే ఒక జీవితం లాంటి సినిమాలు ఒకేసారి నెంబర్స్ వచ్చేసేవి కావు.
రెండో వారం కూడా అన్ని చోట్ల ఆడుతుంది. వీకెండ్స్ లో సక్సెస్ ఫుల్ రన్ వుంది. ఇంకో రెండు మూడు వారాలు కూడా నిలకడగా వుంటుందని భావిస్తున్నా.
మీకు కంఫర్ట్ గా వుండే జోనర్ ?
ఏది కంఫర్ట్ కాదు. మనం కానిదే అక్కడ చూపించాలి. అయితే కామెడీ కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తా. మనం బయట కూడా హ్యాపీ గా బ్రతకొచ్చు కదా. ఇంటెన్స్ రోల్స్ లో ఎంతకాదన్న ఒత్తిడి వుంటుంది. ఇలాంటి రోల్స్ కి డిటాచ్ అవ్వడం కూడా కష్టమే. నిజానికి ఇలాంటి పాత్రలు చేయొద్దని మా డాక్టర్ చెప్పారు(నవ్వుతూ)
అమల గారు మిమ్మల్ని మూడో కొడుకు అన్నారు కదా ?
నాకు అఖిల్ చిన్నప్పటి నుండి తెలుసు. ఐతే అమల గారు, నాగార్జున గారితో ఎక్కువ ఇంటరాక్షన్ ఈ సినిమాతోనే మొదలైయింది. నిజంగా మూడో కొడుకులానే చూస్తారు. ఈ విషయంలో నేను లక్కీ.
వెన్నెల కిషోర్, ప్రియదర్శితో పని చేయడం గురించి ?
దర్శితో ఒక సినిమా చేశా. వెన్నెల కిశోర్ ఎప్పటి నుండో ఫ్రండ్. వెన్నెల అప్పటి నుండి మా ప్రయాణం. వెన్నెల యుఎస్ లో షూటింగ్ చేస్తున్నపుడు ఫుట్ పాత్ మీద కూర్చుని ”అసలు మనం స్టార్ అవుతామా అవ్వమా” అంటే.. కిషోర్ ”నువ్వు అయిపోయావు బాబు .. నేను మాత్రం ఇక్కడే ఉంటా” అని అనేవాడు. (నవ్వుతూ).
జయాపజయాలు గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారు కదా ?
నిజం చెప్పాలి కదండీ. మంచి సినిమా ఎదో చెడ్డ సినిమా ఎదో ప్రేక్షకులకు తెలుసు. ఒక చెడ్డ సినిమా చేసి దాన్ని హిట్ అని నాకు నేను అనుకుంటే సరిపోదుకదా.
ఫలితాన్ని నిజాయితీ ఒప్పుకోవడం కూడా మంచి చేస్తుంది.
ఈ సినిమా చూసి మీ ఇంట్లో ఏమన్నారు ?
మా ఇంట్లో వాళ్ళు మోస్ట్ అన్ ఎక్స్ ప్రెసీవ్ (నవ్వుతూ) ‘బావుంది. బాచేశావ్’ ఇంతే. ఇండస్ట్రీ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని, తేజు, కార్తి, సిద్ధార్ద్ ఇలా చాలా మంది.. ”మంచి సినిమా చేశావ్, నీ కెరీర్లో ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా, చాలా గర్వంగా నీ లైబ్రెరీలో పెట్టుకునే సినిమా’ అని ప్రశంసించారు.
చాలా సన్నగా కనిపిస్తున్నారు .. ఎన్ని కిలోలో తగ్గారు ? సీక్రెట్ చెప్పండి ?
14 కిలోలు తగ్గాను. సీక్రెట్ ఏమీ లేదు. తక్కువ తింటున్నాను. రోజుకి వంద గ్రాములు రైస్. మిగతాది ఏమైనా తినండి. నాలుగు గంటలకి ఒకసారి తినండి. తక్కువ తినండి.
కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
కృష్ణ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నా. ఇది పొలిటికల్ డ్రామా. మరో మూడు కథలు ఫైనల్ స్టేజ్ లో వున్నాయి.
ఆల్ ది బెస్ట్
థాంక్స్