అత్యంత చెత్త ఎయిర్ లైన్స్ అంటూ ఏదైనా అవార్డు ఇవ్వాల్సి వస్తే.. ఆ పౌర విమానయాన సంస్థ అందరికంటే ముందు ఉంటుంది. ఏదో ఒకసారో, రెండుసార్లో అనుకుంటే ఏమోలే బడ్జెట్ ప్రాబ్లమ్ అని సరిపెట్టుకోవచ్చు. వరుసగా ఆరేళ్ల పాటు వరస్ట్ ఎయిర్‌లైన్స్ అనే పేరును మూటకట్టుకుందా సంస్థ. దాని పేరే ర్యాన్ ఎయిర్. భయపడొద్దు. మన దేశానికి సంబంధించిన సంస్థ కాదు. యుకేకు చెందిన విమానయాన సంస్థ అది.
యుకేలో మొత్తం 19 బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఉండగా.. చిట్ట చివరి స్థానంలో నిలచింది ర్యాన్ ఎయిర్. లండన్‌కు చెందిన ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. మొత్తం 7,901 మంది ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించారు ఆ సంస్థ ప్రతినిధులు. ప్రయాణికుల్లో 70 శాతం మంది ర్యాన్ ఎయిర్ చెత్త సంస్థగా ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. ఒక్కసారిగా కూడా ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించడానికి ఇష్టపడమని వెల్లడించారు. వాళ్లింతగా అయిష్టత చూపడానికి కారణం- హిడెన్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయట. మనకు తెలియకుండానే మన జేబులను ఖాళీ చేసేస్తారన్నమాట.
ర్యాన్ ఎయిర్ ప్రతినిధులు మాత్రం సమర్థించుకుంటున్నారు. ఈ ఆరేళ్ల కాలంలో తమ ప్రయాణికుల సంఖ్య 80 శాతం పెరిగిందంటున్నారు. చెత్త అనేది ఉన్నప్పుడు ఉత్తమ అనేది కూడా ఉండాలి కదా! మరి టాప్-5లో ఉండే ఎయిర్‌లైన్స్ ఏవంటే- ఆరగ్ని ఎయిర్ సర్వీస్, స్విస్ ఎయిర్‌లైన్స్, జెట్ 2, నార్వేజియన్, కేఎల్ఎం. ఈజీ జెట్ 11వ స్థానంలో, బ్రిటీష్ ఎయిర్‌వేస్ 15 ప్లేస్‌లో నిలిచాయి.