Amit Shah: అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం.. కానీ చివరి నిమిషంలో..!

ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం (ఆగస్టు 30) నాడు ఆయన రెండు రోజుల ముంబై పర్యటన ముగించుకుని గుజరాత్‌కు బయలుదేరే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో లోపం గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

విమాన సమస్యలతో సతమతమవుతున్న సమయంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ముందుకు వచ్చి తన విమానాన్ని అమిత్ షా, ఆయన కుటుంబ సభ్యుల ప్రయాణానికి అందుబాటులో ఉంచారు. దీంతో ఎట్టకేలకు షిండే ప్రత్యేక విమానంలో అమిత్ షా గుజరాత్‌కు బయలుదేరారు. ఈ సంఘటనపై అధికార వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి.

ఇదిలావుంటే, కేంద్ర హోంమంత్రి ప్రయాణిస్తున్న విమానంలో లోపం తలెత్తడం భద్రతా వర్గాలను కూడా ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి స్థాయి నాయకుల ప్రయాణంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ ఇటువంటి ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. సకాలంలో లోపాన్ని గుర్తించకపోతే తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ సంఘటనతో అమిత్ షా భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. ఆయన ప్రయాణించే విమానాల తనిఖీల్లో మరింత కఠినత్వం అవసరమని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఇకపై ఇలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి.