ఢిల్లీ నుంచి పూణేకు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ ఘటన అనంతరం విమాన తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో, మార్గమధ్యంలోనే పక్షి విమానాన్ని ఢీకొట్టినా.. అది పైలట్‌కు తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పూణేలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాతే ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు.
విమానాన్ని పరిశీలించిన తర్వాత, పక్షి ఢీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించి, తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. AI-2470 ఫ్లైట్ పూణే నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉండగా, ప్రయాణాన్ని రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనపై విమాన ఇంజనీరింగ్ బృందం సమగ్రంగా తనిఖీలు నిర్వహిస్తోంది.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారికి తాత్కాలిక వసతి కల్పించామని, తిరిగి బుక్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వడంతో పాటు, టికెట్ రద్దు చేసుకునే వారు డబ్బు తిరిగి పొందవచ్చని సంస్థ వివరించింది. ఢిల్లీ వెళ్లాల్సిన వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో సంస్థపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. నిర్వహణ లోపాల కారణంగా ఇటీవలే సంస్థ ఎనిమిది సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజా ఘటన ఈ సమస్యలను మరింత ముద్ర వేసేలా మారింది.