ఎయిర్ ఇండియా విమానం కూలడానికి కారణం ఇదే.. చివరి క్షణాల్లో పైలట్ పంపిన సంకేతం ఏంటో తెలుసా..!

లండన్‌ వెళ్లాల్సిన విమానం… విమానాశ్రయాన్ని వదిలిన కాసేపటికే కుప్పకూలింది. ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురయ్యింది. జూన్‌ 12 మధ్యాహ్నం టేకాఫ్‌ అయిన ఈ విమానం ఆరే నిమిషాల్లో నియంత్రణ కోల్పోయి నేలకు ఢీకొట్టింది. తక్షణమే మంటలు చెలరేగాయి. ప్రమాదం చోటుచేసుకునే సమయానికి ఆ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 232 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన 10 మంది సిబ్బందిగా డీజీసీఏ వెల్లడించింది. మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

విమానంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక ప్రయాణికుల వివరాల ప్రకారం… 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, 2 పసిపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. పైలట్లు సుమీత్‌ సబర్వాల్‌, క్లైవ్‌ కుందర్‌గా గుర్తించబడ్డారు. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే 825 అడుగుల ఎత్తులో ఫ్లైయింగ్‌ లిఫ్ట్‌ను కోల్పోయి నేల మీదకు జారిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది.

ఘటనకు కాస్త ముందు “మేడే” అనే అత్యవసర సంకేతాన్ని పైలట్లు పంపినట్టు అధికారికంగా ప్రకటించారు. విమానయాన రంగంలో “మేడే” అనేది అత్యవసర పరిస్థితులలో మాత్రమే వినిపించే కోడ్‌. ఇది ఫ్రెంచ్ పదం “మైడర్” (M’aider) నుంచి ఉద్భవించింది.. దీని అర్థం “నాకు సహాయం చేయండి”. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు రేడియో ద్వారా పంపబడుతుంది. అయినా అత్యవసర సహాయం అందేలోపే విమానం కూలిపోయింది.

ప్రమాదస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నాల్లో అగ్నిమాపక సిబ్బంది, గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించే పనిలో వైద్య బృందాలు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నాయి. ప్రమాదానికి గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదంతో మరోసారి విమాన ప్రయాణ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.