హెచ్‌1-బీ విసాల‌పై ట్రంప్ అస‌క్తిక‌ర ట్వీట్‌..!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌న‌కు స్వ‌దేశీయుల టాలెంట్‌పై న‌మ్మ‌కం ఎక్కువ‌. అందుకే- సొంత వారికే ఎక్కువ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డానికి ఆయ‌న మొద‌ట్లో ప్ర‌య‌త్నాలు చేశారు. `బై అమెరికా, హైర్ అమెరికా` అనే సూత్రానికి క‌ట్టుబ‌డి ఆయ‌న ప‌ని చేశారు. క్ర‌మంగా ఆయ‌న త‌న వైఖ‌రిని మార్చుకున్నారు. అన్ని దేశాల స‌మ్మేళ‌న‌మే అమెరికా అంటూ తాజాగా నిన‌దిస్తున్నారు.

త‌మ‌ దేశంలో చ‌దువుకున్న వాళ్లు ఇక్క‌డే ఉద్యోగాలు చేయొచ్చ‌ని మొన్న‌టికి మొన్న ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. శుక్ర‌వారం ఆయ‌న‌ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ వ‌దిలారు. ఈ ట్వీట్ భార‌తీయ నిపుణులు, భార‌తీయ కంపెనీల‌కు ఉప‌యోగ‌ప‌డేదే అవుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. హెచ్‌1-బీ విసాలను స‌ర‌ళీక‌రిస్తామ‌ని అన్నారు.

హెచ్‌1-బీ విసా హోల్డ‌ర్లు అమెరికాలో మ‌రింత స్వేచ్ఛ‌గా నివ‌సించ‌వ‌చ్చ‌ని, త‌మ‌దేశ పౌర‌స‌త్వం ల‌భించ‌డానికి ఇది తోడ్ప‌డుతుంద‌ని అంటూ ట్వీట్ చేశారు. ప్ర‌తిభ‌ను, అత్యుత్త‌మ నైపుణ్యం ఉన్న వారు త‌మ దేశంలో ఉద్యోగ అవ‌కాశాలు పొందేలా ప్రోత్స‌హిస్తామ‌నీ ఆయ‌న చెప్పారు. లోక‌ల్ టాలెంట్‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా విదేశీయుల‌ను వెన‌క్కి పంపించేస్తార‌నే భ‌యాన్ని వ‌దులుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.