జగమంత ఒక వింత చదరంగము.. పాడు విధియేమొ కనరాని సుడిగుండము..!
నిజమే కదా.. నీ జీవితం..నా జీవితం.. ఎవరో ఆడే చదరంగం..!
ముఖ్యమంత్రి అనే రాజు.. క్యాబినెట్లో ఎందరున్నా అవకాశం కోసం పొంచి ఉండి రాజు కొంపనూ ముంచే ఓ కంత్రీ మంత్రి.. చెయ్యని పనులకూ ప్రజాధనంతో భారీ ప్రచారమిచ్చే శకటాలు.. పన్నులు.. మద్యం విక్రయాలు.. సర్కారును నడిపే జోడు గుర్రాలు.. రాజు..మంత్రులు.. ఎమ్మేల్యేలు..అధికారులు.. వీరిపై చేసే ఖర్చు తెల్ల ఏనుగుల లెక్క.. అదీ మనకే బొక్క.. ఈ అందరి అక్రమాలను కాస్తూ.. వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నించకుండా తోస్తూ భటులు.. ప్రభుత్వ ఉద్యోగులమనే సంగతే మర్చిపోయే నమ్మినబంట్లు..!
అరవై నాలుగు గళ్లు.. వాటిని తమకు నచ్చిన రీతిలో నప్పించుకునే అరవై నాలుగు కళల నేతలు.. ప్రజాస్వామ్యానికే వాతలు.. మనకి రోతలు..!
ఇక ఎత్తుకు పైయెత్తులు.. అందకుంటే కాళ్ళు.. అందితే జుత్తులు.. గళ్ళు మారినంత సులువుగా పార్టీలు మారే నక్కజిత్తులు.. ఎవరైతే తమకు తలి అవకాశం ఇచ్చి అందలం ఎక్కించారో వారినే తిట్టిపోసే జబర్దస్తులు.. రాజకీయ వ్యాపారస్తులు..!
కొన్ని పావులు చివరి వరకు నడిస్తే అవతారం మార్చే జీవులు.. రాజకీయాల్లో చిరంజీవులు.. సజ్జ(ను)లా.. దుర్జనులా..!
మొత్తానికి ఇలాంటి పావుల కలయికతో బోర్డు.. దాని పేరే చదరంగం.. దుష్టజీవుల ఉనికితో ఇప్పుడది చెదరంగం.. కనిపించని చెయ్యేదో చిత్రంగా నవ్వుతూ నడిపించే ‘జగన్నా’టకం..!