విజయశాంతి తెలుగు సినీనటి, నిర్మాత, రాజకీయ నాయకురాలుగా అందరికీ సుపరిచితమే. ఈమె 1966లో వరంగల్లో పుట్టి మద్రాసులో పెరిగారు. విజయ శాంతి పిన్ని విజయ లలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె పిన్ని పేరులోని విజయ ని తీసుకొని విజయశాంతిగా పేరు మార్చుకున్నారు. తనకు ఏడు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడే బాలనాటిగా నటించింది. తరువాత కథానాయిక గా తమిళ దర్శకుడు భారతీ రాజా దర్శకత్వంలో 1979లో వచ్చిన రాళ్లకు కన్నీళ్లు వస్తాయి మొదటి సినిమా. అదే సంవత్సరం 1979లో తెలుగులో తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో కృష్ణ , దర్శకురాలు విజయనిర్మల.
విజయశాంతి సినిమాలలోకి వచ్చాక నాలుగు సంవత్సరాల పాటు ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. టి కృష్ణ దర్శకత్వంలో 1983లో వచ్చిన నేటి భారతం సినిమా తనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇలా క్రమంగా సినిమాలు చేస్తూ దక్షిణ భారతదేశంలో ఏ హీరోయిన్ కి దక్కని గౌరవ ప్రశంసలు దక్కాయని సినీ ఇండస్ట్రీలో సమాచారం. ఆమె 1987లో శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమెకు పిల్లలు లేరు. ఈమె తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషలలో దాదాపు 180 సినిమాలలో నటించారు.
ఆమె తెలుగు, తమిళం మలయాళం, కన్నడ హిందీ భాషలలో నటించారు. ఆమె ద లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. 1991లో తాను నటించిన కర్తవ్యం సినిమాకు గాను ఉత్తమ నటి గా పురస్కారాన్ని అందుకుంది. ఏడుసార్లు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశం ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం లను తీసుకుంది. ఈమె చిరంజీవితో 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్ తో 7 సినిమాలలో నటించారు.
ఈమె ఎక్కువగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో నటించడం జరిగింది. తరువాత 1998లో భారతీయ జనతా పార్టీ లో చేరి రాజకీయ ప్రవేశం చేసింది. తరువాత 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. తర్వాత 2009లో ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. 2009లో టిఆర్ఎస్ నుండి మెదక్ జిల్లాలో ఎంపీగా గెలిచింది.
2013లో ఆమె పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటుందని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయబడింది. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యింది. 2020లో భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం కొనసాగుతుంది. చివరగా ఈమె నటించిన చిత్రం సరిలేరు మీకెవ్వరు. ప్రస్తుతం 10 కోట్ల వరకు ఆస్తి ఉన్నట్టు సమాచారం.