ఎక్కడికెళ్లినా గూగుల్ మనపైన నిఘా పెడుతోంది. అంతేకాదు మెసేజెస్ కూడా రికార్డ్ చేస్తుంది. లొకేషన్ సెట్టింగ్స్ లో ఆఫ్ చేసినా ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల సమాచారాన్ని సేకరిస్తోంది గూగుల్. ఈ విషయం అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఈ వివరాలను ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ పరిశోధకులకు పంపగా ఇది వాస్తవమేనని తేల్చారు. అనుమతి లేకుండా గూగుల్ పౌరుల సమాచారాన్ని సేకరిస్తుందని వారు ధృవీకరించారు.
గూగుల్ మ్యాప్స్ వాడేటప్పుడు యూజర్ లొకేషన్ తెలుసుకోవటానికి అనుమతినివ్వాలి. అప్పుడు వారి రాకపోకలు, ఎక్కడ ఎంతసేపు ఉన్నారు ఇలాంటి వివరాలను గూగుల్ ఆటోమేటిక్ గా రికార్డు చేస్తుంది. ఇది ఇష్టం లేని యూజర్స్ కోసం లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసే సౌకర్యాన్ని తెచ్చింది ఈ సంస్థ. ఇది వాడితే లొకేషన్ రికార్డు కాదని ఆ సంస్థ పేర్కొంది. కానీ పరిశోధకులు ఇది అవాస్తవమని తేల్చారు. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినప్పటికీ కొన్ని గూగుల్ యాప్స్ యూజర్లు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో రికార్డు చేస్తుంది.
మీరు గూగుల్ మ్యాప్ ని ఒక సెకండ్ ఆన్ చేస్తే చాలు స్క్రీన్ షాట్ తీసుకుంటుంది గూగుల్. ఆటోమేటిక్ గా వెదర్ రిపోర్ట్స్ ఇచ్చే అప్లికేషన్స్ కూడా యూజర్ ఇన్ఫర్మేషన్ ని గూగుల్ కి పంపిస్తున్నాయి. అసలు లొకేషన్ కి సంబంధం లేని కొన్ని అప్లికేషన్స్ కేవలం 30 సెం.మీ. ఖచ్చితత్వంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ కి అందిస్తున్నాయి.
యూజర్ల అనుమతి లేకుండా గూగుల్ వారి సమాచారాన్ని సేకరించింది అని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జొనాథన్ మేయర్ వెల్లడించారు. కానీ దీనిని ఇంకోలా సమర్ధించుకుంటున్నారు గూగుల్ ప్రతినిధులు. వినియోగదారులకు మెరుగైన సమాచారాన్ని ఇవ్వటానికే యూజర్ల సమాచారాన్ని తెలుసుకుంటున్నామని పేర్కొంటున్నాయి గూగుల్ వర్గాలు. myactivity.google.com ద్వారా యూజర్లు తమ సెర్చింగులు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.