అటు చికాగో..ఇటు కాలిఫోర్నియా: క్యా హోగ‌యా?

ఉత్త‌ర అమెరికా మ్యాప్ గురించి అవగాహ‌న ఉందా? ఆ దేశంలోని రెండు ప్ర‌ధాన న‌గ‌రాలు చికాగో ఓ మూల‌కు, కాలిఫోర్నియా ఇంకో మూల‌కు ఉంటాయి క‌దా! నిన్న‌టి దాకా మంచు తుఫాన్ల‌తో అత‌లాకుత‌లమైంది చికాగో. పోలార్ వొర్టెక్స్ ప్ర‌భావం వ‌ల్ల ఏర్ప‌డిన చ‌లి తీవ్ర‌త నుంచి ఇప్ప‌టికీ బ‌య‌ట ప‌డ‌లేక‌పోతోంది. గ‌డ్డ‌క‌ట్టుకుపోయింది.

తాజాగా – ఇంకో మూల‌లో ఉన్న కాలిఫోర్నియా ఇలాంటి వాతావ‌ర‌ణాన్నే అనుభ‌విస్తోంది. కాక‌పోతే- చ‌లి కాదు. వ‌ర్షం. మామూలు వ‌ర్షం కాదు. ఈదురు గాలుల‌తో కూడుకున్న భారీ వ‌ర్షం. దీని దెబ్బ‌కు ద‌క్షిణ కాలిఫోర్నియా చిగురుటాకులా వ‌ణికిపోయింది. అక్క‌డ నెల‌కొన్న వాతావ‌ర‌ణానికి `భారీ` అనే ప‌దం స‌రిపోదు. పెనుగాలులు వీచాయి.

ప్ర‌త్యేకించి- తీర ప్రాంత రేవు ప‌ట్ట‌ణం శాంటా బార్బ‌రా ఈ తుఫాన్ ధాటికి అత‌లాకుత‌ల‌మైంది. ఈ న‌గ‌రంలో 80 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచాయంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. వ‌ర‌ద నీరు రోడ్ల‌ను ముంచి వేసింది. భారీ వృక్షాలు కూక‌టి వేళ్ల‌తో స‌హా నేల కూలాయి. కార్లు గాలికి చిత్తు కాగితాల్లో ఎగిరిపోయాయి.

శాంటా బార్బ‌రాలోని ప‌ల్ల‌పు ప్రాంతాల్లో నాలుగు అడుగుల మేర వ‌ర్ష‌పు నీరు చేరింది. ఆ నీటిని తోడేయ‌డానికి స‌హాయ‌క సిబ్బంది శ్ర‌మిస్తున్నారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా స్తంభించిపోయింది. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేల‌కూలాయి. మ‌లీబు, క‌రోల్ క్యావెల్ల న‌గ‌రాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

2,478 కిలోమీట‌ర్ల పొడ‌వు ఉన్న యుఎస్ 101 జాతీయ ర‌హ‌దారిని కొన్ని గంట‌ల పాటు మూసివేశారు. వ‌ర్ష ప్ర‌భావం త‌గ్గిన త‌రువాత తెరిచారు. కాగా, మ‌రో 48 గంట‌ల పాటు ద‌క్షిణ కాలిఫోర్నియాలో భారీ నుంచి అతి భారీ వ‌ర్ష‌లు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు నేష‌న‌ల్ వెద‌ర్ స‌ర్వీస్-బే ఏరియా వెల్ల‌డించింది.

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర ప‌నులు ఉంటే త‌ప్ప బ‌య‌టికి రావ‌ద్ద‌ని స్థానిక అధికారులు సూచించారు. ప్రాంతాలవారీగా ఎక్క‌డెక్క‌డ ఎంత మేర వ‌ర్షం కురిసింద‌నే వివ‌రాల‌ను వెల్ల‌డించారు. తుపాను ప్ర‌భావం ఉన్న ప్రాంతాల్లో విద్యాసంస్థ‌లకు సెల‌వును ప్ర‌క‌టించారా? లేదా? అనేది ఇంకా తెలియ‌రావాల్సి ఉంది.