చ‌ందమామ‌లో చీక‌టి కోణం..ఛేదించే దిశ‌గా!

మ‌నం రోజూ చూసే చంద‌మామ ఎలా ఉంటాడు? పిండి ఆర‌బోసిన‌ట్లు వెండి వెన్నెల వెలుగుల‌తో మెరిసిపోతూ క‌నిపిస్తుంటాడు క‌దా! అలాంటి చంద‌మామ‌లో కూడా చీక‌టి కోణాలు చాలానే ఉన్నాయి. భూమి రెండు వైపులా ఎలా ఉందో మ‌న‌కు తెలుసు? మ‌న‌లో చాలామంది భూమిని చుట్టేసి వ‌చ్చిన వాళ్లూ ఉన్నారు. చంద్రునిలో మాత్రం మ‌నం ఒక వైపునే చూస్తున్నాం. చంద‌మామ‌కు మ‌రో వైపు ఏముందో ఎవ‌రికీ తెలియ‌దు.

`చంద్రునికి అవ‌త‌ల‌..?` అనే ప్ర‌శ్న అ స‌మాధానం ఎవ‌రికీ దొర‌క‌లేదు. దీన్ని ఛేదించ‌డానికి చైనా న‌డుం బిగించింది. `చాంగ్ ఇ-4` పేరుతో పంపించిన స్పేస్ క్రాఫ్ట్ చైనా కాల‌మానం ప్ర‌కారం గురువారం ఉద‌యం చంద్రునిపై దిగింది. అమెరికాకు నాసా, మ‌న‌కు ఇస్రో త‌ర‌హాలోనే చైనా అకాడ‌మీ ఆఫ్ స్పేస్ టెక్నాల‌జీ చాంగ్ ఇ-4ని ప్ర‌యోగించింది.

కింద‌టి నెల 8న ఝామ్మంటూ చందురుని వైపు దూసుకెళ్లిన ఈ స్పేస్ క్రాఫ్ట్‌..మ‌న కంటికి క‌నిపించే వైపు కాకుండా చంద‌మామ‌కు అవ‌త‌లి వైపు ఈ ఉద‌యం 10:26 నిమిషాల‌కు సుర‌క్షితంగా దిగింది. అక్క‌డితో ఆగిపోలేదు. అడుగు మోపిన వెంట‌నే.. తాను దిగిన ప్ర‌దేశానికి సంబంధించిన ఫొటోల‌ను భూమికి చేర‌వేసింది. ఈ ఫొటోలతో పాటు 50 సెకెన్ల నిడివి ఉన్న ఓ వీడియోను కూడా భూమికి పంపించిందా స్పేస్ క్రాఫ్ట్‌. వాటిని చైనా న్యూస్ ఏజెన్సీ `చైనా గ్జిన్‌హువా న్యూస్` త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.