2026 సంవత్సరానికి ఆకాశం ఓ అద్భుత స్వాగతం పలికింది. జనవరి 3 (శనివారం) నాడు వచ్చిన తొలి పౌర్ణమి సాధారణ పౌర్ణమిలా కాదు.. ఇది వోల్ఫ్ సూపర్ మూన్. భూమికి మరింత దగ్గరగా వచ్చిన చంద్రుడు సాధారణ రోజులతో పోలిస్తే మరింత పెద్దగా, ఎంతో ప్రకాశిస్తూ ఆకాశాన్ని మంత్రముగ్ధం చేశాడు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక ప్రత్యేక స్థితిలో ఉండటంతో ఈ పౌర్ణమి కనువిందుగా మారింది.
సూపర్ మూన్‌గా కనిపించే ఈ పౌర్ణమి సాధారణ పౌర్ణమి కంటే సుమారు 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశంతో దర్శనమిచ్చింది. భారత్‌లో సాయంత్రం నుంచి రాత్రంతా ఈ చంద్రుడు తూర్పు ఆకాశంలో నెమ్మదిగా పైకి వస్తూ ఆకాశ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. కొండలు, భవనాల అంచులను దాటి చంద్రుడు ఉదయించే వేళ కనిపించిన దృశ్యం నిజంగా మంత్రముగ్ధం చేసేలా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో సూపర్ మూన్‌ను స్పష్టంగా చూడలేని పరిస్థితి కూడా ఏర్పడింది.
ఈ పౌర్ణమికి వోల్ఫ్ మూన్ అనే పేరు రావడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉత్తర అమెరికా స్థానిక తెగల విశ్వాసాల ప్రకారం జనవరి నెలలో శీతాకాల తీవ్రత వల్ల తోడేళ్లు ఎక్కువగా మూలుగుతాయని భావించేవారు. అదే సంప్రదాయం ప్రకారం జనవరి పౌర్ణమికి వోల్ఫ్ మూన్ అనే పేరు స్థిరపడింది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం తోడేళ్ల మూలుగుడు ఆకలి వల్ల కాదు.. అవి పరస్పరం సంభాషించుకునేందుకు చేసే సహజ ప్రక్రియ మాత్రమేనని చెబుతున్నారు.
భారతీయ సంప్రదాయంలో ఈ పౌర్ణమిని పౌష పూర్ణిమగా పిలుస్తారు. పంచాంగం ప్రకారం పౌష మాస పూర్ణిమ తిథి జనవరి 2 సాయంత్రం నుంచి జనవరి 3 మధ్యాహ్నం వరకు కొనసాగింది. అందుకే ఉపవాసాలు, పూజలు జనవరి 3ననే నిర్వహించారు. ఈ రోజున గంగా స్నానం చేసి దానధర్మాలు చేయడం వల్ల అపార పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రోక్త నమ్మకం. గంగా స్నానం చేయలేని వారు ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయడం, లేదా సాధారణ తలస్నానం చేయడమే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు.
పౌష పూర్ణిమ సందర్భంగా భక్తులు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువు, లక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సత్యనారాయణ వ్రతం, చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం ముఖ్య ఆచారాలుగా కొనసాగుతాయి. నల్ల నువ్వులు, గోధుమలు, బట్టలు, ఆహార ధాన్యాలను పేదలకు దానం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. కొంతమంది భక్తులు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ, భాగవద్గీత పఠనం చేస్తూ రోజంతా ఆధ్యాత్మికంగా గడిపారు.
ఈ పౌర్ణమిని మహా పౌష్య పూర్ణిమ, పుష్య పూర్ణిమగా కూడా పిలుస్తారు. ఈ రోజున శివాభిషేకం చేయడం, శనేశ్వరుడికి పూజలు నిర్వహించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. శనేశ్వరాలయాల్లో భక్తుల సందడి కనిపించింది. జాతకపరమైన దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ అనేక మంది ప్రత్యేక పూజలు చేశారు. ఇదే రోజున ఆరుద్రోత్సవం, శివముక్కోటి కూడా రావడంతో పౌర్ణమి ప్రాధాన్యం మరింత పెరిగింది.
శాస్త్రీయంగా చూస్తే, ఈ సూపర్ మూన్ ప్రత్యేకత మరింత ఆసక్తికరం. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉండే సమయంలోనే భూమి సూర్యుడికి కూడా దగ్గరగా ఉండటం (పెరిహీలియన్) వల్ల చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. ఇది 2026లో తొలి సూపర్ మూన్ కాగా, ఈ ఏడాది మొత్తం మూడు సూపర్ మూన్స్ మాత్రమే దర్శనమివ్వనున్నాయి.
మొత్తంగా వోల్ఫ్ సూపర్ మూన్ శాస్త్ర విజ్ఞానానికి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు మధ్య ఓ అద్భుత సంగమంగా నిలిచింది. ఆకాశాన్ని చూస్తూ ఆశ్చర్యపోయిన ఖగోళ ప్రేమికులైనా, పూజలతో మునిగిపోయిన భక్తులైనా.. అందరికీ ఈ పౌర్ణమి ఒక ప్రత్యేక అనుభూతిని మిగిల్చింది. శాంతి, సమృద్ధి, సానుకూల శక్తుల కోసం ప్రార్థనలు చేసుకుంటూ ప్రజలు ఈ అపూర్వ చంద్ర దృశ్యాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదించారు.
