Donald Trump: ట్రంప్‌ను హత్య చేయాలని కుట్ర.. మొదట తల్లిదండ్రులను చంపిన 17ఏళ్ల కుర్రాడు

అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఒక 17 ఏళ్ల కుర్రాడు తల్లిదండ్రులను హత్య చేశాడనే ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. నికితా కాసాప్ అనే టీనేజ్ బాలుడు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేయాలని భారీ కుట్ర పన్నాడని, అందుకు అవసరమైన డబ్బు కోసం తన తల్లి టాటియానా కాసాప్ (35), సవతి తండ్రి డోనాల్డ్ మేయర్ (51)ను చంపేశాడని అధికారులు తెలిపారు.

ఈ ఘటన ఫిబ్రవరి 11న చోటుచేసుకుంది. నికితా తన తల్లిదండ్రులను హత్య చేసిన అనంతరం అదే ఇంట్లో మరో 15 రోజులు ఉండిపోయాడు. ఫిబ్రవరి 28న పోలీసులు ఇంటికి వెళ్లినప్పుడు ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నికితా ఇంట్లో నుంచి $14,000 డాలర్లు, వాహనం, పాస్‌పోర్టులు దొంగిలించి పారిపోయాడు. మార్చిలో కాన్సాస్‌లో పోలీసులు అతన్ని ట్రాఫిక్ తనిఖీ సమయంలో అరెస్టు చేశారు. అతని వద్ద తుపాకీ, తూటాలు, నగదు లభించాయి.

ఎఫ్‌బీఐ ప్రకారం, నికితా ఒక నియో-నాజీ గ్రూప్ అయిన “ది ఆర్డర్ ఆఫ్ నైన్ యాంగిల్స్”తో సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పారు. అతని ఫోన్‌లో యూదు వ్యతిరేక మెసేజ్‌లు, హిట్లర్‌ను ప్రశంసించిన నోట్లు, ట్రంప్‌ను హత్య చేయాలన్న ప్రణాళికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా టెలిగ్రామ్ ద్వారా రష్యన్ మాట్లాడే వ్యక్తితో కలసి డ్రోన్లు, పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సమాచారం ఉంది.

ప్రస్తుతం నికితా కాసాప్‌పై రెండు మొదటి స్థాయి హత్యలు, మృతదేహాన్ని దాచిపెట్టిన కేసులతో పాటు అధ్యక్షుడి హత్యాయత్నం, కుట్ర, సామూహిక విధ్వంసక ఆయుధ వినియోగం వంటి తీవ్రమైన ఫెడరల్ కేసులు నమోదు అయ్యాయి. అతను ఇప్పుడు $1 మిలియన్ బాండ్‌పై జైలులో ఉన్నాడు. మే 7న కోర్టులో విచారణ జరగనుంది. నిందితుడు వయసులో చిన్నవాడు కాబట్టి కొంత రీఫ్లెక్సన్ ఇవ్వాలని అతని న్యాయవాది వాదిస్తున్నాడు. కానీ ప్రాసిక్యూషన్ మాత్రం ఇది పూర్తిగా పక్కా ప్రణాళికతో జరిగిందని తేల్చింది.

ఈవీఎం హ్యాక్ | EVMs Can Be Easily Hacked | America National Intelligence Director Tulsi Gabbard | TR