స్టార్ కమెడియన్‌ సూసైడ్ పోస్ట్‌..ఎలర్టైన పోలీసులు

ఒక్కోసారి వృత్తి పరమైన డిప్రెషన్ లేదా పర్శనల్ వ్యవహారాలో డిప్రెషన్ ..ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేస్తుంది. అయితే ఆ క్షణానికి వాళ్లను ఆపగలిగితే ఓ నిండు ప్రాణం నిలపెట్టిన వాళ్లు అవుతాం. అయితే వాళ్లు సూసైడ్ చేసుకునే ఆలచనలతో ఉన్నారనే విషయం ప్రపంచానికి తెలియాలి అంతే. తాజాగా హాలీవుడ్ ప్రముఖ కమిడియెన్ పెట్టిన సూసైడ్ పోస్ట్ తో ఎలర్టయ్యారు పోలీస్ లు.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హాలీవుడ్‌ హాస్య నటుడు పీట్‌ డేవిడ్‌సన్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సూసైడ్ చేసుకుంటాను అనే అర్దం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టారు. ఇది చూసిన అభిమానులు కంగారుపడి పోలీస్ లకు ఉప్పు అందించారు. దాంతో పోలీసులు అప్రమత్తమై హుటాహుటిన ఆయన వద్దకు చేరుకున్నారు.

ఇంతకీ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం పోస్ట్‌ చేశారంటే..‘నీకోసం ఇక్కడ ఉండటానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ ఎంతవరకు ఉంటాననేది తెలీదు. నాకు ఈ భూమ్మీద ఉండాలని లేదు. నేను ఇప్పటివరకు ప్రజలకు సాయం చేస్తూనే వచ్చాను. ఈ విషయం నీతో కూడా చెప్పినట్లు గుర్తు’ అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ పెట్టిన కొద్దిసేపటికే డేవిడ్‌సన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తప్పుకొన్నారు. దాంతో అప్రమత్తమైన న్యూయార్క్‌ పోలీసులు హుటాహుటిన డేవిడ్‌సన్‌ నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డేవిడ్‌సన్‌ పెట్టిన పోస్ట్‌పై ఆయన మాజీ ప్రేయసి, గాయని ఆరియానా గ్రాండే కూడా స్పందించారు.

‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. నీకు ఏదన్నా సాయం కావాలంటే నన్ను అడగొచ్చు. నీకు కావాల్సిన వారంతా నీ చుట్టూనే ఉన్నారని తెలుసు. కానీ నాకు అందరి క్షేమం ముఖ్యం’ అని పోస్ట్‌ చేశారు. డేవిడ్‌సన్‌ అలాంటి షాకింగ్‌ పోస్ట్‌ పెట్టడంతో ఒక్కసారిగా అభిమానులతో పాటు ప్రముఖులు కూడా కంగుతిన్నారు. డేవిడ్‌సన్‌ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోషల్‌మీడియా ద్వారా ట్వీట్లు పెడుతున్నారు.