బాండ్ 007 న‌ల‌భై ఏళ్ల సంప్ర‌దాయానికి ఎండ్ కార్డ్‌

చేతులు మారుతున్న జేమ్స్‌బాండ్‌!

జేమ్స్‌బాండ్.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పేరుకి.. ఈ పేరుతో వ‌చ్చే సినిమాల‌కీ య‌మ క్రేజ్ ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త 40 ఏళ్లుగా ప్ర‌పంచాన్ని బాండ్ చిత్రాలు ఆక‌ట్టుకుంటున్నాయి. భారీ యాక్ష‌న్ .. ఛేజ్ లు.. సాహ‌సాలు.. స‌స్పెన్స్.. థ్రిల్.. రొమాన్స్.. ఇన్ని ఎమోష‌న్స్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే ఫ్రాంఛైజీ ఇది. ప్ర‌పంచ వినాశ‌నాన్ని కోరుకునే శ‌క్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడే ఐకానిక్‌ హీరోగా జేమ్స్‌బాండ్ ఓ రోల్ మోడ‌ల్‌గా నిలుస్తున్నాడు. అయితే గ‌త న‌ల‌భై ఏళ్లుగా అల‌రిస్తున్న బాండ్ రూపు రేఖ‌లు మారుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ్లోబ‌లైజేష‌న్‌, సోష‌ల్ మీడియా విశ్వ‌వ్యాప్తం కావ‌డం ఆడా మ‌గా అనే స‌రిహ‌ద్దు చెరిగిపోవడంతో మ‌గ‌ప్ర‌పంచంతో స‌మానంగా ఆడాళ్లు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో జేమ్స్‌బాండ్ స్థానాన్ని కూడా లేడీ నాయిక‌లు ఆక్ర‌మించ‌బోతున్న‌ట్టు గ‌త కొంత కాలంగా హాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

40 ఏళ్ల త‌రువాత తొలి ఫీమేల్ బాండ్‌!

త్వ‌ర‌లో తెర‌పైకి రానున్న జేమ్స్‌బాండ్ సినిమాలో మెన్ కాకుండా ఉమెన్ బాండ్‌ క‌నిపించే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని బాండ్ చిత్రాల‌కు వ‌న్నె తెచ్చిన జేమ్స్‌బాండ్ హీరో పియ‌ర్స్ బ్రోస్న‌న్ ఇటీవ‌ల ఓ హాలీవుడ్ మీడియాకు వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. లండ‌న్‌కు చెందిన న‌టి ల‌ష‌న ర‌షీద లించ్ 25వ బండ్‌గా క‌నిపించ‌బోతోంది. బ్యాచ్‌ల‌ర్ ఆఫ్ యాక్టింగ్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన లించ్‌ ఫాస్ట్ గ‌ర్ల్స్‌, పౌడ‌ర్ రూమ్‌, బ్ర‌ద‌ర్ హుడ్‌, కెప్టెన్ మార్వెల్ చిత్రాల్లో న‌టించింది.

ప్ర‌స్తుతం డేనియ‌ల్ క్రెయిగ్ న‌టిస్తున్న బాండ్ చిత్రం `నో టైమ్ టు డై` వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. డేనియ‌ల్ న‌టిస్తున్న‌ది బాండ్ సిరీస్ లో 24వ సినిమా. ఇక‌పై అతడికి ఈ సిరీస్ లో న‌టించే ఛాన్సే లేద‌ట‌. అటుపై లించ్ న‌టించే బాండ్ చిత్రం సెట్స్ పైకి వెళుతుంద‌న్న‌మాట‌. ఇన్నేళ్లుగా మ‌గ పురుగుల్నే బాండ్ చిత్రాల్లో చూశారు. ఇక లేడీ బాండ్ ని చూడండి అంటూ బ్రోస్న‌న్ అన‌డంతో హాలీవుడ్ వేడెక్కిపోతోంది. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగ‌జైన్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అత‌డు ఈ ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేశారు.