ఈ రోజుల్లో శరీర సహజ సౌందర్యాన్ని పొందడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ డబ్బును కాలాన్ని వృధా చేసుకోవడంతో పాటు ఎక్కువగా హానికర రసాయనాలు వాడి ఫ్యూచర్లో అనేక స్కిన్ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజువారి ఆహారంలో కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే సరిపోతుందంటున్నారు చర్మ వైద్య నిపుణులు..
మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో క్యారెట్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. క్యారెట్ లో పుష్కలంగా లభించే విటమిన్ సి, విటమిన్ ఏ, సహజ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు వృద్ధాప్య ఛాయాలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కావున రోజు వారి ఆహారంలో క్యారెట్ను తప్పనిసరిగా తినాలి. అలాగే క్యారెట్ జ్యూస్ సేవిస్తే మరీ మంచిది.
టమోటో లో చర్మ ఆరోగ్యాన్ని రక్షించే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ చర్మంపై ముడతలను తగ్గిస్తుంది, టమోటోను రోజువారి ఆహారంలో తీసుకోవడంతోపాటు బాగా పండిన టమోటోను గుజ్జుగా మార్చి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం లోని మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది.
ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును తింటే అత్యధిక ప్రోటీన్స్ ,విటమిన్స్ ,మినరల్స్ లభ్యమవుతాయి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడం తో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పాలకూరను ఆహారంగా తీసుకుంటే సహజ పద్ధతిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
తరచూ గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే కెరొటోనాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్లు చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఎల్లప్పుడూ తడిగా ఉంచడంలో సహాయపడే ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభించే సాల్మన్ వంటి సముద్ర చేపలను ఎక్కువగా తినాలి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే చర్మ సౌందర్యానికి ఉపయోగపడే విటమిన్స్ ,మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.