మనలో విటమిన్ సి ప్రాముఖ్యత… సి విటమిన్ లోపిస్తే కలిగే అనారోగ్య సమస్యలు ఇవే?

ఓ పక్క కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది దానికి తోడు శీతాకాలం కావడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందడానికి మనలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే విటమిన్ సి తప్పనిసరి.
కావున ప్రతిరోజు విటమిన్ సి పుష్కలంగా ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. నారింజ,బత్తాయి,కివి, జామ, యాపిల్, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష,ఉసిరి వంటి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది.

ముఖ్యంగా ఆహార పదార్థాలను ఎక్కువగా వేడి చేస్తే అందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి నశిస్తుంది. అలాగే విటమిన్ సి మూలకం మన శరీరంలో నిల్వ
ఉండదు.మన రోజువారీ జీవక్రియలకు అవసరమైన విటమిన్-సి మోతాదు వివరాలు చూసినట్లయితే పురుషులకు 90 మి.గ్రా, మహిళలకు 75 మి.గ్రా,గర్భిణీ స్త్రీలకు 85, మి.గ్రా, పాలిచ్చే తల్లులకు 120 మి.గ్రా ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి మోతాదు తప్పనిసరిగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మన శరీరంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటే కలిగే ఉపయోగాలు? లోపిస్తే కలిగే దుష్పరిణామాలు? గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే విటమిన్ సి ఆవశ్యకత ఏంటో మనందరికీ తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడినప్పుడు మనలో ఇమ్యూనిటీ శక్తి తగ్గుతుంది. దాన్ని పెంపొందించడానికి ఉత్తమమైన మార్గం విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడమే.విటమిన్ సి న్యూట్రోఫిల్స్ అంటే తెల్ల రక్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.కావున మన శరీరకణాల్లోనీ అనేక ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

మనలో విటమిన్ సి లోపిస్తే మెదడు పనితీరుపై తీవ్ర దుష్ప్రప్రభావాలు తలెత్తి ఆందోళన, డిప్రెషన్, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడంతోపాటు టిబి చికిత్సలో విటమిన్ సి ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నో పరిశోధనలు సూచించాయి.రక్తంలో హిమోగ్లోబిన్ అభివృద్ధికి సహాయపడే ఐరన్ మూలకాన్ని వినియోగించడంలో విటమిన్ సి సహాయ పడుతుంది. విటమిన్ సి లోపిస్తే ప్రమాదకర రక్తహీనత సమస్య ,చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాలు త్వరగా మానకపోవడం, దంతక్షయం, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.