మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన విధానంలో రోజురోజుకు పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా మన దంతాలపై అశ్రద్ధ వహిస్తున్నాం. దాంతో అనేక దంత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి తోడు నీటి కాలుష్యం, ఆహార నియమాలు పాటించకపోవడం, పాన్ ,గుట్కా మద్యపానం, ధూమపానం వంటి కారణాలతో మొదట చిగుళ్ల ఇన్ఫెక్షన్ ప్రారంభమై దంతాలకు రక్షణ కవచంలా ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని దంతక్షయం ఏర్పడుతుంది.
దీంతో దంతాలు దృఢత్వాన్ని కోల్పోయి పుచ్చిపోవడం,
ఊడిపోవడం, చిగుళ్లలో రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలతో ఎక్కువ రోజులు బాధపడితే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇకనైనా మేల్కొని దంతాల పై కొంత శ్రద్ధ వహిస్తే భవిష్యత్తులో దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మన పరిసరాల్లో ఎక్కువగా కనిపించే జామ ఆకులతో అనేక దంత సమస్యలను నయం చేయవచ్చు. జామ ఆకులలో యాంటీ ఫంగల్ ,యాంటీ ఇన్ప్లోమెంట్రీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల జామ ఆకు కషాయాన్ని నోట్లో వేసుకొని పుక్కిలిస్తే నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.అలాగే చిగుళ్ల సమస్యను నోటి దుర్వాసనను, నోటి పూత వంటి సమస్యలను అరికడుతుంది.
ఆయుర్వేదంలో అద్భుత ఔషధంగా వాడే ఉత్తరేణి మొక్క కాడతో ప్రతిరోజు దంతాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మర్రి చెట్టు కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతాలను దృఢంగా ఉంచుతుంది. రాళ్ల ఉప్పును వేడి నీటిలో కరిగించి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకొని పుక్కిలిస్తే పంటినొప్పి తీవ్రత తగ్గుతుంది.
పంటి నొప్పి ఉన్నచోట లవంగాన్ని అరగంటసేపు ఉంచడం వల్ల లేదా లవంగాల నూనెను దంతాలపై మర్దన చేసుకుంటే నొప్పి తీవ్రత తగ్గుతుంది. అలాగే లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. అనేక పంటి సమస్యలను తొలగిస్తాయి.తెల్ల ఉల్లిపాయ రసంలో తేనె కలుపుకొని సేవిస్తే చిగుళ్లలో రక్తం కారే సమస్య తగ్గుతుంది.
పసుపు కొమ్ములను నిప్పులపై బాగా కాల్చి, పొడిచేసిన
తర్వాత ఆ పొడితో పళ్ళను తోముకుంటే చిగుళ్ల వాపులు, పుండ్లు, రక్తం కారడం, చీము కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. కలబందలో ఉండే సహజ సిద్దమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా కలబంద గుజ్జును పంటిపై మర్దన చేస్తే అనేక రకాల సూక్ష్మజీవులను నశింపజేసి దంత క్షయాన్ని నివారిస్తుంది.
రోజుకు ఒక్కసారి వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకుంటే వేపలో ఉండే యాంటీ మైక్రోబియన్ గుణాలు దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాని సమర్థవంతంగా తొలగి అనేక దంత సమస్యలను దూరం చేస్తుంది. అప్పుడప్పుడు నల్ల తుమ్మ చెక్క కషాయంతో నోటిని పుక్కిలిస్తే నోటి పుండ్లు, చిగుళ్ల వాపులు వంటి సమస్యలు తొలుగుతాయి.
ఉదయం సాయంత్రం దంతాలను శుభ్రం చేసుకోనే అలవాటును అలవర్చుకోవాలి. సాఫ్ట్ డ్రింక్స్ ,జంక్ ఫుడ్ ను సాధ్యమైనంత వరకు తీసుకోకపోవడమే మంచిది.
విటమిన్ సి, క్యాల్షియం ఎక్కువగా లభ్యమయ్యే పండ్లను ఎక్కువగా తినాలి. అలాగే క్రమం తప్పకుండా దంత వైద్యుల్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమం.