చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగితేనే రోజు మొదలవుతుందని భావిస్తారు. అయితే స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో మాత్రం “టీ తాగుతూ సిగరెట్ తాగాలి” అనే అలవాటు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కొంత మందికి రిలాక్సింగ్ గా, ఆనందంగా అనిపించవచ్చు. కానీ ఆరోగ్యపరంగా చూస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగుతూ స్మోక్ చేయడం వల్ల శరీరంలో దెబ్బతీనే ప్రభావాలు ఊహించనిదైన స్థాయికి చేరే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి చెబుతున్నారు.
2023లో “అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్” జర్నల్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం, వేడి టీ తాగుతూ సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారికి వివిధ రకాల క్యాన్సర్లు, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, సంతానలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తేలింది. ముఖ్యంగా వేడి పదార్థాలు తినేటపుడు, లేదా తాగేటపుడు దానితో పాటు సిగరెట్ తాగడం శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది.
వేడి టీ వల్ల ఈసాఫేగస్ (అన్నవాహిక) లైనింగ్ దెబ్బతినే అవకాశముంటుంది. ఇదే సమయంలో పొగ తాగినప్పుడు.. దానిలో ఉన్న హానికర రసాయనాలు అక్కడికి చేరి మరింత డ్యామేజ్ చేస్తాయి. దీర్ఘకాలంగా ఈ అలవాటు కొనసాగితే, ఈ భాగంలో క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అంతేకాకుండా, ఊపిరితిత్తులు, గొంతు, గుండె, మెదడు, స్టమక్‌పై దీని ప్రభావం చూపుతుంది. సిగరెట్‌లో ఉండే నికోటిన్ గుండెను వేగంగా పనిచేయించడంతో పాటు రక్తనాళాలపై ఒత్తిడి పెంచుతుంది. అదే సమయంలో టీ ద్వారా వచ్చే కెఫిన్ కూడా అదే పనిని చేస్తుంది. దీని వల్ల గుండెపోటు ప్రమాదం లేదా అధిక రక్తపోటుతో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంటుంది.
కాఫీ, టీతో పొగ కలిపిన ఈ అలవాటు ఫెర్టిలిటీపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించడం, మహిళల్లో హార్మోనల్ అసమతుల్యత కలిగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని ప్రభావంతో వంధ్యత్వం, నపుంసకత్వం వంటి సమస్యలు సంభవించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం, ఈ రెండు పదార్థాల (నికోటిన్ + కెఫిన్) కాంబినేషన్ మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. రక్తప్రవాహం తక్కువ అవడం, తలనొప్పి, తల తిరగడం, ఆలోచన తేడా రావడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగుతూ స్మోక్ చేయడం చాలా ప్రమాదకరం. దీనివల్ల జీర్ణాశయంలో అల్సర్లు రావడం, శక్తినీ రక్తాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు.
తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చేలా అనిపించినా, దీర్ఘకాలికంగా చూసినప్పుడు టీతో స్మోకింగ్ అలవాటు మీ ఆరోగ్యాన్ని ముట్టడి చేస్తుంది. నిదానంగా, కానీ తీవ్రంగా శరీర వ్యవస్థలను దెబ్బతీస్తుంది. దాంతో శారీరక సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇది గమనించకుండా గడిపే ప్రతీ రోజు శరీరానికి మరింత నష్టం చేస్తున్నదే కాని ఉపశమనం కాదు. మొత్తంగా చూస్తే.. టీతో సిగరెట్ అనేది రిలాక్సింగ్ కాంబినేషన్ కాదు. అది నిశ్శబ్ద హంతకం లాంటి అలవాటు అని భావించాలి. అలవాటు చెడిపోతే, ఆరోగ్యం చెడిపోకుండా కాపాడుకునే అవకాశముంటుంది. యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
