కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? కాల్షియం లోపాన్ని సవరించుకునే మార్గాలు ఇవిగో?

మన శరీరంలోని అవయవాలకు రక్షణ కవచంలా ఉండే ఎముకలు దృఢంగా, బలిష్టంగా ఉన్నప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు భావించవచ్చు. ఎముకల్లో దృఢత్వం తగ్గితే మన నిత్య జీవన ప్రయాణంలో రోజువారి కార్యకలాపాలను చేసుకోవడం కష్టం అవుతుంది. ఎముకల్లో దృఢత్వం తగ్గడానికి ప్రధాన కారణం మన ఆహారంలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ డి వంటి పోషకాలు లోపించడమే.ఎముకలను దృఢంగా ఉంచడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది.

మన శరీరంలో కాల్షియం మూలకం లోపిస్తే ఎముకల్లో పట్టుత్వం తగ్గి ఎముకలు బోలుగా మరి భవిష్యత్తులో
ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్,రికెట్స్ వంటి వ్యాధులకు కారణమవుతుంది దీంతో యుక్త వయసులోనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి రోజువారి ఆహారంలో తప్పనిసరిగా కాల్షియం మూలకం లభించే ఆహారాన్ని తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు.

పాలల్లో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది కావున రోజు వారి ఆహారంలో పాలు, పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలి. పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది దీన్ని ఆహారంగా తీసుకోవడంతో పాటు వారంలో ఒకటి లేదా రెండుసార్లు జ్యూస్ రూపంలో తీసుకుంటే మరీ మంచిది. నువ్వుల్లో అత్యధిక కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లభ్యమవుతుంది కావున వీటిని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. వేరుశెనగ గింజల్లో అత్యధికంగా కాల్షియం, విటమిన్ డి లభ్యమవుతుంది కావున వీటిని బెల్లంతో కలిపి తీసుకుంటే మంచిది.

చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిల్లో అత్యధిక కాల్షియం లభిస్తుంది ప్రతిరోజు వీటితో తయారుచేసిన రోటీలు తినడం మంచిది. సెనగలు, పెసలు, సోయాబీన్స్ వంటి పప్పు ధాన్యాలను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటే క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. సాల్మన్ ఫిష్ వంటి సముద్ర చేపల్లో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా తీసుకుంటే సమృద్ధిగా కాల్షియం, ప్రోటీన్స్ లభ్యమయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.