ఆరోగ్యంగా ఉండాలా.. ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే!

మానవ జీవన విధానంలో రోజురోజుకు అనేక మార్పులు జరుగుతున్నాయి. వీటి ద్వారా అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. ఆరోగ్యం ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండి, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలంటే మన జీవిత విధానంలో చిన్నచిన్న మార్పులు చేసుకొని అవి పాటిస్తే సరిపోతుంది.

మానవ జీవనంలో దినచర్య, రుతు చర్య, షడ్ రుచులు మార్పు వల్ల అనారోగ్యం వస్తుంది. మామూలుగా అయితే ఉదయం లేవగానే బ్రష్ అయిపోయినాక కచ్చితంగా నీళ్లు తాగాలి. ఉదయమే లేయడం వల్ల ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో వచ్చే సూర్యకిరణాలు శరీరం పై పడటం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చు.

ఉదయం నిద్ర లేచాక కనీసం ఒక అరగంట అయిన అటు ఇటు నడవాలి. దీని ద్వారా నరాలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మోకాళ్ల నొప్పులు,కీళ్ల నొప్పులు దరి చేరవు. ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న పనికి వాహనాలను వినియోగిస్తుంటాము. దీని ద్వారా మనం తినే ఆహారంలోని కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి బరువు పెరగడమే కాకుండా కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులతో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. నడవడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వు చెమట రూపంలో బయటకు వచ్చి మనిషి బలంగా ఉండటానికి అవకాశం ఉంది.

మనం ప్రతిరోజు 8 గంటల నిద్ర కచ్చితంగా తీసుకోవాలి. శారీరిక శ్రమ చేసిన తర్వాత అలసట పోవడానికి నిద్ర అనేది మంచి మెడిసిన్ లాంటిది. నిద్ర వల్ల శరీరానికి విశ్రాంతి, ఏదైనా ఒత్తిడి ఉంటే కాస్త ఉపశమనం లభిస్తుంది. నిద్ర సరిపోకపోతే శరీరంలోని నరాలు, కంటి దగ్గర నరాలు వాటి పటత్వాన్ని కోల్పోతాయి. దీని ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఏదైనా అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వల్ల శరీరంలో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా సరియైన టైంలో తీసుకుంటే మంచిది. రాత్రి భోజనం తర్వాత కాస్త అటు ఇటు నడిచినట్లయితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది.

ఈమధ్య జీవన విధానంలో ఇంటర్నెట్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. ఇది అవసరమే కానీ ఎక్కువగా వాడడం వల్ల, అంటే దీని అవసరానికి మించి వాడకుండా జాగ్రత్త పడాలి. సెల్ ఫోన్ ను ఎక్కువగా వాడడం వల్ల శరీరంలో రేడియేషన్ ఫామ్ అయి నరాలు బలహీన పడతాయి. తక్కువగా వినియోగించడం వల్ల అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఆహార విషయంలో కూడా బయటి ఆహారానికి అలవాటు పడకుండా ఇంట్లోనే తినడం అనేది ఉత్తమం. ఇలాంటి కొన్ని చిట్కాలు దినచర్యలో భాగంగా పెట్టుకుంటే ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది.