నేటి వేగవంతమైన జీవనశైలిలో మనిషికి రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం అని వైద్యులు చెబుతారు. అయితే పని ఒత్తిడి మారుతున్న జీవన విధానాలు ఈ ఎనిమిది గంటలు నిద్రపోతుంటే.. మరికొందరు కనీసం 6 గంటల నిద్ర కూడా ఉండటం లేదు. మనిషికి మాత్రమే కాదు, జంతువులకూ నిద్ర చాలా అవసరం. కానీ ప్రకృతిలో కొన్ని జీవులు సాధారణ కంటే ఎక్కువ నిద్రిస్తుంటాయి.. వీటి గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.
సాధారణంగా సముద్ర నత్తలు నీటిలో నిశ్శబ్దంగా, నెమ్మదిగా కదలుతూ కనిపిస్తాయి. వీటి జీవన విధానం చాలా సరళంగా ఉంటుంది. అయితే, పర్యావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారితే, ఆహారం అందుబాటులో లేకపోతే లేదా అధిక ఉష్ణోగ్రతలు వేధిస్తే ఇవి తమను తాము రక్షించుకునే విధంగా ప్రత్యేక రీతిలో ప్రవర్తిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని సముద్ర నత్తలు ఒకేసారి మూడు సంవత్సరాలు వరకూ నిద్రాణ స్థితిలోకి వెళ్లి ఉండిపోతాయని అంటున్నారు.
ఈ విధంగా నిద్రపోవడం సాధారణ నిద్ర కాదు. దీన్ని శీతాకాల నిద్ర లేదా హైబర్నేషన్ లాంటి ప్రక్రియగా శాస్త్రవేత్తలు నిర్వచిస్తారు. ఈ సమయంలో సముద్ర నత్త శరీరంలోని అన్ని జీవక్రియలు చాలా నెమ్మదిగా జరుగుతాయి. శరీరం ఆహారాన్ని తక్కువగా వినియోగిస్తుంది. శ్వాసక్రియ, రక్తప్రసరణ, జీర్ణవ్యవస్థ దాదాపు నిలిచిపోతాయి. ఇంతకాలం ఎటువంటి చలనం లేకుండా సముద్రపు అడుగునే ఉండిపోతుంది. పర్యావరణ పరిస్థితులు మళ్లీ అనుకూలంగా మారితే మాత్రమే ఇవి మేలుకుంటాయి.
పచ్చని పచ్చిక, సముద్రపు చిన్న జీవులు అందుబాటులో లేకపోయే పరిస్థితుల్లో, విపరీతమైన వేడి, వాతావరణ మార్పులు ఎదురైనప్పుడు ఇవి దీర్ఘకాల నిద్రలోకి వెళ్తాయి. దీని ద్వారా అవి తమ శక్తిని నిరుపయోగ వ్యయానికి లోనుకాకుండా నిల్వ ఉంచుతాయి. శరీరంలోని జీవక్రియలకు అవసరమైన శక్తిని దాచుకొని, సజీవంగా ఉండటానికి సహకరిస్తుంది. ఈ ప్రత్యేక లక్షణం సముద్ర నత్తలకు మాత్రమే పరిమితం కాదు.
కొన్ని పాము జాతులు, ఎలుకలు, ఎలుగుబంట్లు కూడా కొన్ని నెలలపాటు శీతాకాల నిద్రలోకి వెళ్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ, మూడు సంవత్సరాలపాటు నిద్రించే జీవి మాత్రం సముద్ర నత్తలకే ప్రత్యేకం. ప్రకృతిలోని ఇలా తెలిసి తెలిసి చివరకు తెలియని రహస్యాలు మనల్ని ఎప్పటికీ అబ్బురపెడుతూనే ఉంటాయి.
