ప్రయాణ సమయంలో వాంతులతో ఇబ్బంది పడుతున్నారా.. పాటించాల్సిన చిట్కాలివే!

మనలో కొంతమంది ప్రయాణం చేయాలంటే ఒకింత భయాందోళనకు గురవుతూ ఉంటారు. కళ్లు తిరగడం, వాంతులు కావడం లాంటి సమస్యల వల్ల కొంతమంది బస్సు ప్రయాణాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో బాధ పడతారని వైద్యులు చెబుతున్నారు. ఆడవాళ్లు, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని వైద్యుల నుంచి సమాచారం అందుతుండటం గమనార్హం.

చెవిలో ఉండే ‘లాబ్రింథైస్‘ అనే భాగం వల్లే ప్రయాణ సమయంలో ఈ విధంగా జరుగుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. చెవిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా లాబ్రింథైస్‌పై ప్రభావం పడి వాంతులు, వికారం లాంటి సమస్యలు వస్తాయి. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అల్లం తీసుకోవడం ద్వారా మోషన్‌ సిక్‌నెస్‌, వాంతులు, వికారం తగ్గించే అవకాశాలు ఉంటాయి.

పిప్పరమింట్ ఆయిల్‌ కడుపు నొప్పి, వికారం తగ్గించడంలో ఉపయోగపడతాయి. డిఫ్యూజర్‌లో కొన్ని చుక్కల పిప్పరమెంటు ఎసెన్షియల్‌ వేసి వాసన పీల్చడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. పిప్పర్‌మింట్‌ టీ తాగినా తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఆక్యుప్రెషర్‌లో శారీరక, మానసిక సమస్యలకు సులువుగా చెక్ పెట్టవచ్చు. ప్రయాణ సమయంలో మణికట్టు వద్ద ఒత్తిడి ఇవ్వడం ద్వారా ఈ సమస్యలను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ప్రయాణ సమయంలో నీరు, ద్రవ పదార్థాలను పుష్కలంగా తీసుకోవడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పొడి, వేడి ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో చక్కెర, కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా కూడా ఈ సమస్యలను దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి.