మన భోజనపు అలవాట్లలో చిన్న మార్పులు చేసినా, శరీరంపై కలిగే ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా చెక్కెర వినియోగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల కలిగే లాభాలు ఊహించలేనివి. నిపుణుల ప్రకారం, కేవలం 40 రోజుల పాటు చెక్కెర తినకపోతే శరీరంలోని అనేక అవయవాలు కొత్త శక్తిని సంతరించుకుంటాయని చెబుతున్నారు.
మొదటగా షుగర్ లేదా చెక్కెర 40 రోజులు వాడకం తగ్గిస్తే.. నోటిలో దంతాల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. సాధారణంగా చక్కెర తీసుకున్న తర్వాత నోటిలో బ్యాక్టీరియా ఆమ్లంగా మారి పళ్ళపై దాడి చేస్తాయి. ఇది పళ్ళు కుళ్లడానికి, చీము పట్టడానికి దారి తీస్తుంది. చెక్కెర మానేస్తే ఈ సమస్యలు దాదాపు పూర్తిగా తగ్గిపోతాయి.
అలాగే జీర్ణక్రియలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అధిక చక్కెర తీసుకోవడం వల్ల కడుపులో ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు పెరుగుతాయి. కానీ చెక్కెర మానేస్తే జీర్ణక్రియ సవ్యంగా సాగి, కడుపు సమస్యలు తగ్గుతాయి.
చక్కెరలో కేలరీలు అధికంగా ఉండటం వల్ల బరువు పెరుగుతుంది. కానీ 40 రోజుల పాటు మానేస్తే శరీరంలోని అదనపు కేలరీలు కరిగిపోవడంతో బరువు తగ్గుతుంది. అదే సమయంలో, కాలేయ ఆరోగ్యం కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వల్ల ఏర్పడే కాలేయ కొవ్వు కరిగిపోవడంతో లివర్ మరింత చురుకుగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యం పరంగా కూడా ఇది ఒక బంగారు అవకాశం. చక్కెర రక్తంలోని ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. కానీ 40 రోజులపాటు మానేస్తే గుండె బలపడటమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది. ఆరోగ్య నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. చక్కెర మానడం ఒక చిన్న నిర్ణయం కావొచ్చు, కానీ దాని ఫలితం జీవితాంతం మేలు చేస్తుంది.
