పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య నిపుణులు!

వాతావరణంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు,తేమ శాతం ఎక్కువ కావడంతో ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్‌ ప్రజలపై విజృంభిస్తాయి.దీనివల్ల ప్రజల ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రమాదకర శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో వైర్‌సల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. స్వైన్‌ఫ్లూ, ఆర్‌ఎస్‌వీ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందడంతో చిన్నారులు అకస్మాత్తుగా జ్వరం,జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆర్‌ఎస్‌వీ, స్వైన్‌ఫ్లూ కూడా కొవిడ్‌ మాదిరిగానే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతాయి.ఎవరైనా తుమ్మినా,దగ్గినా ఇతరులకు త్వరగా వ్యాపిస్తాయి. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మాస్కు పెట్టుకోవాలి.

గత మూడు సంవత్సరాలుగా మనల్ని కలవర పెట్టిన కొవిడ్‌ మహమ్మారి ప్రభావం తగ్గిపోయిందని నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌తో పాటు స్వైన్‌ఫ్లూ, ఆర్‌ఎస్‌వీలు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి.ఆర్‌ఎస్‌వీ పిల్లల నుంచి మొదలై పెద్దలకు సోకుతుంది.ఆర్‌ఎస్‌వీ అంటే జలుబులో ఒక కారకమైన ఇన్‌ఫెక్షన్‌. దగ్గు, జ్వరం, జలుబు, ఇన్‌ఫెక్షన్ల లక్షణాలు ఉంటే ఆర్‌ఎస్‌వీగా అనుమానించాలని.. ప్రత్యేకమైన ఆర్టీపీసీఆర్‌తో నిర్ధారించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ఈ చలికాలంలో ప్రధానంగా జలుబు కారకమైన రెస్పిరేటరీ సిన్‌కైషియల్‌ వైరస్‌ “ఆర్‌ఎస్‌వీ”, మైల్డ్‌ కొవిడ్‌, స్వైన్‌ఫ్లూ ప్రభావం చూపుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ వంటివి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే రక్షణ వ్యవస్థ మన ముక్కులోనే ఉంటుంది. ముక్కులో తగినంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ప్రమాదకర సూక్ష్మజీవులు ప్రవేశించిన వెంటనే ఆవిరిపోయే గుణం ఉంటుంది. ఈ శీతాకాలం సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా ముక్కులో తగినంత ఉష్ణోగ్రత లేకపోతే ఆ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించి శ్వాస సంబంధించిన ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది. శీతాకాలంలో శ్వాసకోస ఇన్ఫెక్షన్ల సమస్య నుంచి తప్పించుకోవడానికి శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి. మాస్కు పెట్టుకోవడం వల్ల ముక్కు భాగం వేడిగా ఉంటుంది. మంకీ క్యాప్‌ను కూడా ధరించవచ్చు.