Ginger: మార్కెట్లోకి నకిలీ ‘అల్లం’..! శ్రేష్టమైందో.. కాదో ఇలా తెలుసుకుని కొనండి..!!

Ginger: ‘మార్కెట్ లోకి కొత్త దేవుడొచ్చాడు..’ అని ఓ సినిమాలో డైలాగ్. అలా తయారైంది పరిస్థితి. మార్కెట్ లో దొరికే వస్తువుల్లో నకిలీ.. బియ్యంలో నకిలీ.. నకిలీ విత్తనాలు.. ఇలా కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇప్పుడు ఏకంగా కూరగాయల్లో కూడా కల్తీ జరుగుతోంద. ఇందుకు ఉదాహరణే ‘నకిలీ అల్లం’. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అల్లంకు డిమాండ్ పెరిగింది. వ్యాధినిరోధక శక్తి పెంచడంలో అల్లం పాత్ర ఎక్కువ. అందుకే.. అచ్చం అల్లంలా ఉండే అడవి వేర్లను తీసుకొచ్చి అల్లం అంటూ అమ్మేస్తున్నారు మోసగాళ్లు. కాబట్టి.. మార్కెట్లో దొరికే అల్లం మంచిదో కాదో ఈ సింపుల్ టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు..

అల్లం కొనేటప్పుడు గోటితో గిచ్చి చూడాలి. అలా చేయగానే అల్లం సువాసన, ఘాటు ద్వారా తెలిసిపోతుంది. అలాంటి సువాసన వస్తే నిజమైన అల్లమే. చాలాసేపటి వరకూ వేలి గోరుకు ఉన్న అల్లం సువాసన వస్తూనే ఉంటుంది. కానీ.. అలా వాసన రాకపోతే అది మంచి అల్లం కాదు.. దానిని కొనవద్దు. సాధారణంగా అల్లం తొక్క చాలా పలుచగా ఉంటుంది. గోటితో గీకితే చాలు.. తొక్క ఊడుతుంది. అలా తొక్క ఊడి వస్తే అది నిజమైన అల్లం. కానీ.. తొక్క రాకుండా గట్టిగా ఉంటే అది నకిలీ అల్లం.. కొనొద్దు. 

అల్లం మట్టి.. ఇసుకలోనే పెరుగుతుంది. కాబట్టి.. మంచి అల్లానికి మట్టి ఉండి తీరాలి. మట్టి లేకుండా నునుపుగా.. అందంగా ఉంటే.. కెమికల్స్‌తో క్లీన్ చేసిన అల్లం అయి ఉండొచ్చు. మట్టిని తొలగించేందుకే అలా చేస్తుంటారు. అలాంటి అల్లం కూడా కొనొద్దు. మట్టితో ఉన్న అల్లమే శ్రేష్టం. ఇంటికి తెచ్చుకున్నాక ఎలాగూ కడిగి శుభ్రం చేసుకుంటాం. అల్లంని కడిగిన తర్వాత వెంటనే ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

అల్లం తొక్కను తీసేసి.. మిక్సీలో గ్రైండ్ చేసి పేస్టులా అయిన తర్వాత ఓ సీసాలో వేసి గట్టిగా మూత పెట్టి.. అప్పుడు మాత్రమే ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అల్లం పాడవకుండా ఉంటుంది. దాని ఫ్లేవర్ కూడా పాడవదు. అల్లం.. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలసట, రొమ్ము నొప్పిని పోగొడుతుంది. అల్లం రసాన్ని పాలు లేదా టీలో కలుపుకొని తాగితే… పొట్ట క్లీన్ అవుతుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. గమనించగలరు.