Heart Attack: హార్ట్ ఎటాక్ రాడానికి.. 10 ఏళ్ల ముందే శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఇవే..!

గుండెజబ్బులు, ముఖ్యంగా హార్ట్ ఎటాక్, ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ వస్తున్నాయి. ఆఫీసులో కుర్చీలో కూర్చోని చేసే పనులు, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం.. ఇవన్నీ హార్ట్ సమస్యలకు దారి తీస్తున్నాయి. కానీ అసలు హార్ట్ ఎటాక్ రాకముందే మన శరీరం కొన్ని హెచ్చరికలు ఇస్తుందని తాజా సర్వే ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

ఆ సర్వే ప్రకారం.. హార్ట్ ఎటాక్ వచ్చే 10 నుంచి 12 సంవత్సరాల ముందే మన యాక్టివ్నెస్ తగ్గిపోవడం మొదలవుతుంది. అంటే మునుపటిలా హుషారుగా ఉండకుండా, పని చేసే ఉత్సాహం తగ్గుతుంటుంది. ఇది చాలా స్లోగా జరుగుతుంది కాబట్టి, మనం అంచనా వేయలేము. కానీ ఇది ఒక ముఖ్యమైన ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ సమస్యను పూర్తిగా ఆపేయలేమన్నా, కొన్ని చిన్న మార్పులు చేస్తే గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కూడా అధ్యయనం చెబుతోంది.

అందులో మొదటి మార్పు.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నుండి 1 గంట వరకు ఫిజికల్ యాక్టివిటీ తప్పక చేయాలి. అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, సైక్లింగ్, యోగా, డ్యాన్సింగ్.. ఏదైనా సరే, శరీరం కదలడమే ముఖ్యం. ఫిజికల్ యాక్టివిటీ రక్త ప్రసరణను మెరుగుపర్చడమే కాకుండా, గుండె మీద ఒత్తిడి తగ్గిస్తుంది.

రెండవ మార్పు.. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు. వీలైనంతవరకు బయట ఫాస్ట్ఫుడ్, అవసరం లేని జంక్ ఫుడ్ మానేసి, ఇంట్లోనే తాజాగా, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పచ్చి కూరలు, నట్లు, మిల్లెట్స్, ఫైబర్ అధికంగా ఉండే వంటకాలు గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి.

ఈ రెండే మార్పులు.. రోజువారీ ఫిజికల్ యాక్టివిటీ ఆరోగ్యకరమైన ఇంటి భోజనం.. పాటిస్తే, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాన్ని చాలా మేర తగ్గించవచ్చు. ఇప్పటికే ప్రమాదం ఉన్నవారికీ ఈ మార్పులు పెద్ద మేలు చేస్తాయి. నిపుణులు చెబుతున్నట్లు, మన శరీరం ఇస్తున్న చిన్న హెచ్చరిక సిగ్నల్స్ని పట్టించుకోవడం ఆవశ్యకం. వయస్సు ముప్పై దాటింది అంటే ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. గుండె మనకు జీవం ఇచ్చే యంత్రం కాబట్టి, దానిని రక్షించుకోవడం మన వంతు బాధ్యత.