మొలకెత్తిన శనగలను బెల్లంతో కలిపి తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

సాధారణంగా మొలకెత్తిన గింజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా డైటింగ్ చేసేవారు ఉదయం అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలను తింటూ ఉంటారు. ఇలా మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల ఆరోగ్యానికి కావలసిన పోషకాలు లభించడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేయవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో మొలకెత్తిన విత్తనాలు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. ఈ క్రమంలో మొలకెత్తిన శెనగలతో పాటు బెల్లం కలిపి తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం, మొలకెత్తిన శనగలు కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా బెల్లంలో ఆరోగ్యానికి అవసరమైన ఐరన్ మెగ్నీషియం పోషకాలు దాగి ఉంటాయి. ఇక మొలకెత్తిన శనగలలో కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మొలకెత్తిన సెనగల తో పాటు బెల్లం కలిపి తినడం వల్ల రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. బెల్లం శనగలలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. బెల్లం శనగలు కలిపి తినడం వల్ల రక్తంలో ఐరన్ శాతం పెరిగి ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది దీంతో శరీరంలో రక్తహీనత సమస్య దూరం అవుతుంది.

బెల్లం మొలకెత్తిన శనగలు కలిపి తినడం వల్ల హై బీపీ సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది. బెల్లం శనగలలో ఉండే పొటాషియం మెగ్నీషియం వంటి పోషకాలు శరీరంలో అధిక రక్తపోటు సమస్యను నియంత్రిస్తాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా ఉంటాయి. అంతేకాకుండా శనగలలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేసి జీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు గుప్పెడు శనగలు తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి కావాల్సిన శక్తిని అందించి ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో శరీర బరువు తగ్గుతుంది.