సిట్రస్ జాతికి చెందిన కమలా పండ్లు ఎక్కువగా శీతాకాలంలో మనకు అందుబాటులో ఉంటాయి. వీటి అద్భుతమైన రుచిని, సువాసనని ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా కమలాపండ్లలో అత్యధిక విటమిన్ సి లభ్యమవుతుంది. దాంతోపాటే మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు,ఫ్లేవనాయిడ్లు, కాల్షియం ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.
రోజుకు రెండు కమలాపండ్లను ఆహారంగా తీసుకుంటే మన జీవక్రియలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు సమృద్ధిగా లభించినట్లే. అంతేకాకుండా కమలా పండులో సమృద్ధిగా ఉన్న విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయ పడడమే కాకుండా మనం తీసుకునే ఆహారం నుంచి ఐరన్ మూలకాన్ని సమృద్ధిగా మన శరీరం గ్రహించడానికి తోడ్పడి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య తొలగి నీరసం, అలసట వంటి సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.
కమలా పండులో సమృద్ధిగా ఉన్న పొటాషియం, ఐరన్
మరియు హెర్పెరెడిన్ అనే ఎంజైమ్ రక్తనాళాలను శుభ్రపరిచి రక్తప్రసరణ వ్యవస్థను వేగవంతం చేస్తుంది. దాంతో గుండె ఆరోగ్యము, అధిక రక్తపోటు వంటి సమస్యలు తొలగిపోతాయి. కమలాపండ్లలో సమృద్ధిగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తాయి. కావున డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు రోజులు ఒక్క కమలా పండును కచ్చితంగా ఆహారంలో తీసుకోవాలి. అలాగే వీటిలో పుష్కలంగా ఉన్న ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థలో లోపాలను సవరించి మలబద్ధకం గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తొలగిస్తుంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కమలా పండ్లను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడంలో చక్కగా సహాయపడుతుంది. ప్రతిరోజు కమల పండ్లను తినేవారు వృద్ధాప్య ఛాయాలను తరిమికొట్టవచ్చు. అలాగని మరీ ఎక్కువ కమలాపండ్లను ఆహారంగా తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ పై వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదం ఉంది. కావున రోజుకు ఒకటి లేదా రెండు కమలాపండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవడం ఉత్తమం.