అధిక రక్తపోటుకు కారణాలు ఏంటో తెలుసా… రక్త పోటును అదుపు చేసే మార్గాలివే!

ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక సమస్యలతో సతమతమవుతూ అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల ఎన్నో సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. అందులో ముఖ్యంగా హై బీపీ దీన్నే అధిక రక్తపోటు అని కూడా అంటారు. హై బీపీ గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. గుండె జబ్బు, గుండె సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న అధిక రక్తపోటుకు గల కారణాలు, రక్తపోటును అదుపులో ఉంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా అధిక రక్తపోటు సమస్యకు మన జీవన విధానంలో సంతరించుకుంటున్న సమూలమైన మార్పులు, ఆహారపు అలవాట్లే కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చిన్న వయసులోనే ఎక్కువ మందిని వేధిస్తున్న అధిక రక్తపోటు సమస్యకు కారణాలు ఉబకాయం, మద్యపానం , ధూమపానం, జంక్ ఫుడ్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, అధిక వత్తిడి, అలసట ,డిప్రెషన్, శారీరిక శ్రమ తగ్గడం వంటి సమస్యలు హై బీపీకి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మనం వీటిని అధిగమించినప్పుడే రక్తపోటు సమస్యను అదుపులో ఉంచవచ్చు.

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సోడియం అంటే ఉప్పు శాతాన్ని తగ్గించాలి. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే రక్త పోటుకు కారణమై గుండె పనితీరులో వ్యత్యాసం ఏర్పడుతుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఆహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసము , ఫాస్ట్ ఫుడ్స్ ,పాలు, వెన్న వంటి పదార్థాలను పక్కన పెట్టాలి. లేదంటే రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి అధికారక్తపోటు సమస్యకు దారి తీయవచ్చు.

గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ధూమపానం, మద్యపానం జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇందులో ఉండే హానికర పదార్థాలు మన నాడీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపి మానసికంగా సమస్య ఏర్పడుతుంది. దీంతో అధిక రక్తపోటు సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.

ప్రతిరోజు కొంత శారీరిక శ్రమ కలిగిన వ్యాయామం, నడక , యోగ వంటివి అలవాటు చేసుకుంటే శారీరక శ్రమతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగు పరిచి భవిష్యత్తులో అధిక రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు.