వేసవిలో రోజుకు ఒక కూల్ డ్రింక్ బదులు గ్లాస్ మజ్జిగ తాగితే ఎలాంటి ప్రయోజనాలో తెలుసా?

వేసవికాలం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అధిక ఎండలు మండిపోతున్న తరుణంలో ఎండ తీవ్రత కారణంగా చాలామంది వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఇతరత సమస్యలతో బాధపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేసవికాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇక వేసవికాలం వచ్చింది అంటే మనకు ఎక్కడ చూసిన కూల్డ్రింక్స్ దర్శనమిస్తూ ఉంటాయి. అయితే వేసవి తాపం నుంచి బయటపడటానికి కూల్ డ్రింక్స్ తాగడం కన్నా ఒక గ్లాస్ మజ్జిగ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉండటం వల్ల ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది. ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మండే ఎండ నుంచి ఇంటికి రాగానే ఒక గ్లాసు మజ్జిగ తాగితే చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది.ఇలా ప్రతిరోజు మజ్జిగ తాగడం వల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు అనే విషయానికి వస్తే…

మజ్జిగలో రిబోఫ్లోవిన్ ని అందించే విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడమే కాకుండా మన శరీరాన్ని చల్లగా ఉంచి కడుపులో ఏ విధమైనటువంటి మంట అజీర్తి లక్షణాలు లేకుండా ఉండేలా కాపాడుతుంది. మజ్జిగలో పేగుల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది ఆహారాన్ని వేగంగా, సాఫీగా జీర్ణం అయ్యేలా చేయడంలో
సహాయ పడటమే కాకుండా మన శరీరంలో జీవక్రియలు సరైన క్రమంలో పనిచేయడానికి దోహదపడుతుంది. మజ్జిగలో ఉండే కాల్షియం మన ఎముకలు దంతాలు దృఢంగా మారడానికి దోహదం పడుతుంది అందుకే ప్రతిరోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నింటిని మన సొంతం చేసుకోవచ్చు.