సాధారణంగా వయస్సు పైబడిన వారిలో కనిపించే మతిమరుపు సమస్య ఈ రోజుల్లో చిన్నపిల్లలు మరియు యుక్త వయస్సు వారు ఎదుర్కోవడం ఒకింత ఆందోళన కలిగించే విషయమని చెప్పొచ్చు. జ్ఞాపకశక్తి లోపంతో బాధపడేవారు చదువు, కెరియర్, వృత్తిపరమైన అంశాల్లో వెనుకబాటు తనం వల్ల నలుగురితో కలవలేక తీవ్ర మనోవేదనను అనుభవిస్తుంటారు. అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలను మరిచిపోయి స్కూల్లో టీచర్లతో, ఆఫీసులో బాస్ తో చివాట్లు తినడం పరిపాటిగా మారుతుంది ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే రోజువారి ఆహారంలో మెదడు ఆరోగ్యాన్ని రక్షించి జ్ఞాపకశక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మొదట మీకు మెదడు, నాడీ కణ వ్యవస్థను దెబ్బతీసే చెడు అలవాటులైన మందు కొట్టడం, సిగరెట్ తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, కాఫీ టీ వంటివి మోతాదుకు మించి తాగడం, అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్స్ మొబైల్స్ చూసుకుంటూ గడపడం వంటి చెడు అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి. అలాగే రోజువారి ఆహారంలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్స్,ఫ్లేవనాయిడ్లు,మెగ్నీషియం, జింక్ ,విటమిన్ ఈ, విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండే పాలు, పెరుగు, చేపలు, చిక్కుళ్ళు, బీన్స్, గుమ్మడి గింజలు, గోధుమలు, బార్లీ, చిరుధాన్యాలు,వోట్స్ మొదలైనవి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
రోజువారి మీ ఆహారంలో విటమిన్ సి, కాల్షియం ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభించే పాలకూర, బచ్చలి కూర, క్యారెట్, చిలగడ దుంపలు, నువ్వులు, బెల్లం, బాదంపప్పు వాల్నట్ వంటి పదార్థాలను ఆహారంగా తీసుకుంటే మెదడు కణాలు దృఢంగా మారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.అలాగే ప్రతిరోజు వ్యాయామం, యోగ, శ్వాస మీద ధ్యాస వంటి ఆసనాలను అలవాటు చేసుకుంటే పనిలో ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి పెంపొందుతుంది