ఈ ఆహార పదార్థాలు మెదడుకు మేలు చేస్తాయి.. జ్ఞాపకశక్తి క్షీణించదు..!

మనలో చాలా మంది శరీరానికి మాత్రమే కాదు, మెదడుకూ ప్రత్యేక శ్రద్ధ అవసరమని మరచిపోతారు. కానీ వయసు పెరిగినా చురుకైన జ్ఞాపకశక్తి, మానసిక ఉత్సాహం కొనసాగాలంటే సరైన ఆహారం తప్పనిసరి. చదువుకునే పిల్లలు, ఉద్యోగ ఒత్తిడిలో ఉండే యువత, వయసు మీద పడిన పెద్దలు అందరికీ మెదడు ఆరోగ్యం అత్యంత కీలకం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడమూ అంతే అవసరం. సరైన ఆహారపు అలవాట్లు, క్రమమైన జీవనశైలి ఉంటే జ్ఞాపకశక్తి బలంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది, మానసిక అలసట దూరం చేస్తాయని చెబుతున్నారు.

నిపుణులు సూచించిన కొన్ని సూపర్ ఫుడ్స్ ఇవే:
వాల్‌నట్స్: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వాల్‌నట్స్ మెదడుకు అద్భుతమైన ఆహారం. జ్ఞాపకశక్తి పదునుగా మారుతుంది. విటమిన్-ఈ వయసుతో వచ్చే మానసిక సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.

బాదం: మెగ్నీషియం, విటమిన్-ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే బాదం నరాలను బలోపేతం చేస్తుంది. ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే పిల్లల చదువు సామర్థ్యం పెరుగుతుంది.

ఆకుకూరలు: పాలకూర, మెంతి, ఆవాలు వంటి ఆకుకూరల్లో విటమిన్-కె, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తాయి.

పండ్లు: నారింజ, యాపిల్, ద్రాక్ష, బ్లూబెర్రీలు మెదడు పనితీరును పెంచుతాయి. ముఖ్యంగా బ్లూబెర్రీలను బ్రెయిన్ బెర్రీ అని పిలుస్తారు, ఎందుకంటే అవి జ్ఞాపకశక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

చేపలు: సాల్మన్, టూనా, సార్డిన్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు నిర్మాణానికి చాలా అవసరం. వారానికి రెండు సార్లు చేపలు తింటే డిప్రెషన్ ప్రమాదం కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

పెరుగు: కడుపు ఆరోగ్యమే కాదు, మెదడుకు కూడా మేలు చేసే ఆహారం పెరుగు. అందులోని ప్రోబయోటిక్స్ మూడ్‌ను మెరుగుపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి.

నిపుణుల ప్రకారం రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం కూడా మెదడు ఆరోగ్యానికి కీలకం. నీటి కొరత concentration తగ్గిస్తుంది. అలాగే జంక్ ఫుడ్, అధికంగా వేయించిన పదార్థాలు మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

కేవలం ఆహారం సరిపోదు. ధ్యానం, యోగా, క్రమమైన వ్యాయామం కూడా మెదడుకు సమానంగా అవసరం. ఇవి నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. అందుకే నిపుణులు చెబుతున్న సందేశం ఒక్కటే “ఆహారాన్ని మార్చండి, జీవనశైలిని మెరుగుపరచండి.. మీ మెదడు వయసుతో మసకబారదు. జ్ఞాపకశక్తి పదునుగా, ఆలోచనల వేగం చురుకుగా ఉంటుంది.