పుదీనా ఆకుల్లో ఉండే అద్భుత ఔషధ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో సహాయపడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఘాటైన సువాసన, అద్భుత ఔషధాలు కలిగిన పుదీనా ఆకులతో చర్మ అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించుకొని సహజ పద్ధతిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకొని వృద్ధాప్య ఛాయలను అధిగమించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
తరచూ చర్మ సమస్యలతో బాధపడేవారు పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తటి మిశ్రమంగా మార్చుకున్న తర్వాత అందులోకి తగినన్ని రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని ముఖ చర్మం , మెడ భాగంలో సున్నితంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి మూడుసార్లు చేసుకుంటే చర్మంపై వచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్, ముడతలు తగ్గి సహజ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.
పుదీనా, నిమ్మరసం ఉపయోగిస్తే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. దీనికోసం పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తటి మిశ్రమంగా మార్చుకున్న తర్వాత అందులోకి నిమ్మ రసాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని ముఖ చర్మం , మెడ భాగంలో సున్నితంగా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
వృద్ధాప్య ఛాయాలను తరిమికొట్టడంలో పుదీనా, పెరుగు, తేనె లో ఉండే ఔషధ గుణాలు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తాయి. ఇందుకోసం పుదీనా ఆకులను తీసుకొని అందులోకి పెరుగు, తేనె వేసి మిక్సీ జార్ లో మెత్తటి మిశ్రమంగా మార్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ వేసుకొని 20 నిమిషాల పాటు ఉండి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోయి చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.