అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్స్ లో ఒకటైన పానీపూరిని తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే దొరికే పానీపూరి ప్రస్తుత రోజుల్లో ప్రతి పల్లెలోనూ, ప్రతి సందులోనూ పానీ పూరి సెంటర్లు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి పానీ పూరి తింటే ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తదు అదే ప్రతిరోజు ఎక్కువ మోతాదులో పానీ పూరిని తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు.
పానీ పూరి లో అత్యధికంగా ఉపయోగించే ఉప్పు, కారం,మసాలా,పులుపు పదార్థాల వల్ల యాసిడ్ రిఫ్లెక్షన్ జరిగి పేగులు వాటి సహజ స్థితిని కోల్పోయి అనేక అల్సర్ సమస్యలకు దారి తీయవచ్చు. పానీపూరి ఎక్కువగా తినే వారికి జీర్ణవ్యవస్థలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది.పానీపూరీ రుచి కోసం టేస్టీ సాల్ట్ ఎక్కువగా ఉపయోగిస్తారు కావున దీన్ని తరచూ తింటుంటే రక్తపోటు, గుండెపోటు సమస్య తలెత్తవచ్చు. పానీ పూరి లో ఎక్కువగా ఉపయోగించి మసాలా దినుసులు కారణంగా కడుపులో మంట, గొంతు మంట, అజీర్తి సమస్యలు తలెత్తవచ్చు.
ముఖ్యంగా రోడ్ సైడ్ పానీ పూరి ని ఎక్కువగా తింటే కలుషిత ఆహారం కారణంగా ప్రమాదకర బ్యాక్టీరియా పొట్టలో చేరి తీవ్రమైన డయేరియా సమస్యకు దారి తీయవచ్చు. అలాగే వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. శుభ్రత లేని పానీపూరిని ఎక్కువగా తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగి తీవ్రమైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. పానీపూరి ఎక్కువగా తింటే పిల్లల్లో డిహైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు. గుండెపోటు, హై బీపీ, చక్కెర వ్యాధి, అల్సర్ వంటి సమస్యలతో బాధపడేవారు పానీ పూరి ఎక్కువగా తింటే వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.