వేసవి కాలం వచ్చిందంటేనే దాహం.. దాహం అంటాం. సూర్యతాపం, వాతావరణం అలాంటిది. మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, కూల్ డ్రింక్స్, సోడా.. ఇలా శరీరానికి నీరు రూపంలో ఎప్పుడూ ఏదొకటి అందిస్తూనే ఉంటాం. అయితే.. అన్నింటిలో మన ఇంటిలో మంచి నీరు ఎక్కువగా తాగుతాం. మరీ ముఖ్యంగా వేసవిలో మాత్రమే ఉపయోగించే ‘కుండ’ నీటిని తాగడానికి మరింత ఇష్టపడతాం. ఇసుక పేర్చి అందులో కుండ పెట్టి, దాని చుట్టూ గుడ్డ పెట్టి అప్పుడప్పుడూ తడుపుకుంటూ ఉంటే.. ఆ కుండలోని చల్ల బడుతుంది. ఆ నీరు తాగితే మన శరీరం చల్లబడుతుంది. మనసుకి హాయి కలుగుతుంది.
ఫ్రిజ్ కూలింగ్ వాటర్ కంటే ఈ కుండ నీరే ఎంతో శ్రేష్టం అని పెద్దలు అంటారు.. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సహజమైన మట్టితో తయారు చేసిన కుండ కావడంతో అందులో పోసిన నీరు నిస్సందేహంగా ప్యూరిఫైడ్ వాటర్ తో సమానం అంటున్నారు. నీటిలో ఎటువంటి మలినాలు ఉన్నా మట్టి పీల్చుకుని మనకు స్వచ్ఛమైన, చల్లని నీటిని ఇస్తుంది. అందుకే చలివేంద్రాల్లో మట్టి కుండలనే ఉపయోగిస్తారు. మజ్జిగను కూడ మట్టి కుండలోనే ఇస్తారు. ఎంతటి సంపన్న కుటుంబమైనా వేసవిలో కుండ నీరు ఉపయోగించేందుకు ఇష్టపడతారు.
ముఖ్యంగా మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల వడదెబ్బకు దూరంగా ఉండొచ్చు. దగ్గు, జలుబు, ఆస్త్మా ఉన్నవారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులోని మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ శరీరానికి శక్తిని ఇస్తాయి. ప్లాస్టీక్ బాటిల్స్ వినియోగం ఎక్కువైన ప్రస్తుత రోజుల్లో కుండ నీటి శ్రేష్టం గురించి తెలుసుకోవడం చాలా ఉత్తమం. వాటికంటే కుండ నీరే ఉత్తమమని డాక్టర్లు కూడా సూచిస్తారు. కుండల పేదవారి ఫ్రిజ్ అంటూంటారు. వేసవిలో కుండ దగ్గర పేద, గొప్ప తారతమ్యాలు ఉండవు.
ఫ్రిజ్ లోని చల్లదనం, ప్యూరిఫైయింగ్ మిషన్ లోని ప్యూరిఫైడ్ వాటర్ ఒకటే ఖర్చుతో కుండలోనే దొరుకుతాయి. వేసవి వచ్చిందంటే ప్రతిచోటా నల్ల, ఎర్ర మట్టి కుండలు అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. కుండల్లోనే కూజాలు కూడా ఉంటాయి. ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండి రాత్రిళ్లు డాబాపై నిద్రించే సమయంలో తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది. మంచి నిద్రకు కూజా నీళ్లూ సాయపడతాయి. అందుబాటు ధరల్లో లభ్యమయ్యే కుండలు.. అవి అందించే మంచి నీరు ఆరోగ్యానికి మంచిది.