లేదు మొర్రో అంటున్నా మీడియా వదలటం లేదు

ఫలానా హీరో ..ఫలానా దర్శకుడు సినిమాలో నటిస్తున్నాడంటూ వార్తలు మీడియాలో కనపడుతూంటాయి. అయితే వాటిలో చాలా భాగం జరగనే జరగవు. అసలు ప్రపోజల్ స్దాయిలో కూడా ఉండవు. కానీ మీడియా మాత్రం ఆ రోజు ఏదో ఒక న్యూస్ ఉంటే చాలన్నట్లుగా మసాలా కలిపేసి హైలెట్ చేసేస్తూంటుంది. ఇప్పుడు అదే కన్నడ హీరో యష్ కు జరుగుతోంది.

ఆయన ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో విలన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం యష్ చెవిన పడటంతో నేను ఆర్ ఆర్ ఆర్ లో నటించడం లేదని ఒకవేళ జక్కన కోరితే తప్పకుండా నటిస్తానని అని తేల్చి చెప్పేసాడు. అయినా సరే తెలుగు మీడియా ఆ మాటను పట్టించుకోకుండా..చర్చలు జరుగుతున్నాయి.

రేపో మాపో ప్రకటన వచ్చేస్తుంది అని ప్రచారం చేస్తోంది. దానికి తోడు ఈ మధ్యన యష్ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ సమయంలో రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేసారు. దాంతో ఈ వార్తకు మరింతగా ఆజ్యం పోసినట్లైంది. అయితే ఇలాంటి ప్రచారం వల్ల యష్ కెరీర్ కే దెబ్బ తగిలే అవకాసం ఉంది.

ఎందుకంటే రాజమౌళి సినిమా ఒప్పుకున్నాడంటే ..చాలా రోజులు డేట్స్ ఇస్తాడు..మా సినిమా ఎక్కడ చేస్తాడని మిగతా నిర్మాతలు భావించే అవకాసం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త మీడియా ఆలోచించి కథనాలు రాస్తే బాగుంటుందని యష్ శ్రేయాభిలాషులు అంటున్నారు.