ఒక హీరోతో అనుకున్న కథలు వాళ్లతో కాకుండా వేరే వాళ్లతో చేయటం సినీ ఇండస్ట్రీలో మామూలే. ఇప్పుడు అలాంటి ఆఫరే తమిళ యంగ్ హీరో జీవా గుమ్మం తట్టింది. విజయ్ దేవరకొండ నో చెప్పటంతో ఫైనల్ గా జీవా సీన్ లోకి వచ్చారు. దాంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే అది వెయ్యి కోట్ల ప్రాజెక్టు. ఇంతకీ ఆ ప్రాజెక్టు వివరాలు జీవా నోటి వెంటే విందాం.
జీవా మాట్లాడుతూ..‘1983 వరల్డ్ కప్ అనే చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి నటించబోతున్నాను. బాహుబలి చిత్రం ఎలాగైతే సిల్వర్‌స్క్రీన్‌పై బ్రహ్మాండాన్ని ఆవిష్కరించిందో అదే తరహాలో ఈ చిత్రం ఉంటుంది. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ క్రీడ నేపథ్యంలో తొలిసారిగా బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు కెమెరా ముందు నిలబడదామా అన్నంత ఉత్సాహంతో ఉన్నాను.
1983లో వరల్డ్‌కప్ గెలిచి ఇండియాకు ఘనతను తెచ్చి పెట్టిన సంఘటనే ఈ చిత్ర ఇతివృత్తం. చిత్ర షూటింగ్ మే మాసంలో లండన్‌లో ప్రారంభమై 100 రోజుల పాటు షూటింగ్ ను జరుపుకోనుంది. అందుకు నేను ఇప్పటి నుంచే తయారవుతున్నాను.
అప్పట్లో ఆ క్రికెట్ టీమ్‌లో ప్రముఖ క్రీడాకారుడిగా రాణించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నేను నటించనున్నాను. ఆయన పాత్రలో నటించడం గర్వంగా ఉంది. ప్రముఖ బౌలర్ చందు ఇంటికి వచ్చి నాకు శిక్షణ ఇస్తున్నార’ని తెలిపారు. ఎంఎస్.ధోని, లగాన్ చిత్రాల వరుసలో ఈ 1983 వరల్డ్ కప్ చిత్రం చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఈ పాత్రలో సంచలన నటుడు విజయ్ దేవరకొండ ని అడిగారు. అయితే వరస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో …విజయ్ నో చెప్పారు. దాంతో ఈ ఆఫర్ జీవా తలుపు తట్టింది.