‘ఘాజి’ సినిమాతో సముద్ర గర్భంలో జరిగిన యుద్దాన్ని చూపించిన సంకల్ప్ రెడ్డి ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోకి తీసుకెళుతున్న సంగతి తెలిసిందే. అంతరిక్షం 9000KMPH టైటిల్ తో రూపొందుతున్న చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రపంచం మొత్తం శాటిలైట్ కమ్యూనికేషన్ దెబ్బతినే ప్రమాదం ఉందని గమనించిన హీరో అంతరిక్షంలోకి వెళ్ళి ఆ నెట్వర్క్ ని ఏ విధంగా సెట్ చేశారు అనే అంశం ఖచ్చితంగా సినిమాని హిట్ గా నిలబెడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత సంకల్ప్ ఏ తరహా కథ చేయబోతున్నారనే అంచనాలు అప్పుడే ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో చర్చ సైతం మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం…ఈ సినిమా తర్వాత సంకల్ప్ రెడ్డి…దేశ రక్షణకోసం పనిచేసే ఆర్మీ చుట్టూ కథ అల్లారని తెలుస్తోంది. అయితే రెగ్యులర్ వార్ బేస్ కథలకు భిన్నంగా ఓ వార్ క్యాంప్ లో జరిగే కథనం చుట్టూ తన తదుపరి చిత్రం కథ నడపాలని డిసైడ్ అయ్యనట్లు సమాచారం.
ఇప్పటికే నీటిలో, గాలిలో కథలు చేసిన సంకల్ప్ తర్వాత కథ ఖచ్చితంగా భూమి మీద జరుగుతుందని అంటున్నారు. అది కూడా మిలిట్రీ చుట్టూ జరిగే కథ అవుతుందని, దేశభక్తిని మిళితం చేస్తూ సాగుతుందని చెప్పుకుంటున్నారు. అయితే కాస్తంత భారీ బడ్జెట్ తో కూడుకున్నది అవుతుందని అందుకే మూడో సినిమాగా ఎంచుకున్నాడని వినికిడి.