రెండు రోజుల క్రితం విడుదలైన నాలుగు సినిమాల్లో తాప్సీ నటించిన ‘గేమ్ ఓవర్’కే మంచి మార్కులు పడ్డాయి. ప్రివ్యూలతో మంచి క్రేజ్ తెచ్చుకోవటం, అప్పటికే ట్రైలర్స్, టీజర్స్ తో సినిమా లవర్స్ లో సినిమాపై ఆసక్తి పుట్టడంతో ఓపినింగ్స్ బాగానే వచ్చాయి మొదటిరోజు టాక్ బాగుండటంతో శనివారం నాడు ఈ వసూళ్లు భారీగా పుంజుకుని డబుల్ అయ్యాయి. ఈ నేపధ్యంలో ఓ మంచి హిట్ సినిమాలో చేసిన ఉత్సాహంలో తాప్సీ ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటీ అంటే ఈ సినిమాకు మొదట ఆప్షన్ తాప్సీ కాదు. మరి ఎవరా హీరోయిన్..
మూడేళ్ల కింద మయూరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అశ్విన్ శరవణన్. ఆ సినిమాతోనే ఆకట్టుకున్నాడు అశ్విన్. మయూరిలో హీరోయిన్ నయనతార. ఆ సినిమా పూర్తయ్యాక స్క్రిప్టు పనుల్లో రెండేళ్లు గడిపి ఈ గేమ్ ఓవర్ స్క్రిప్టు రాసుకొచ్చాడు. మళ్లీ నయనతారకే ఈ కథని వినిపించాడు. నయనతార కు కూడా ఈ కథ నచ్చటంతో వెంటనే ఓకే అంది. అయితే సినిమా ప్రారంభించే సమయానికి ఈ కథ నాదే, నా సినిమా నుంచే ఎత్తారు అంటూ ఓ హాలీవుడ్ రైటర్ నిర్మాతలకు నోటీసిచ్చాడు.
దాంతో సినిమా మొదటే ఆగిపోయింది. దాంతో టైమ్ తీసుకుని చాలా మార్పులు చేసి స్క్రిప్టుని పట్టుకుని నయనతార దగ్గరకు వెళ్లాడు. కానీ అప్పటికే ఆమె వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. దాంతో తాప్సీని ఎప్రోచ్ అయ్యాడు.ఆమె చెప్పిన చిన్న చిన్న మార్పులతో గేమ్ ఓవర్ అంటూ మరో కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సారి తాప్సీతో ఈ ప్రయోగం చేయటం ప్లస్ అయ్యింది అశ్విన్ కు. క్రెడిట్ మొత్తం నయనతారకే వెళ్లకుండా ఈ సారి డైరక్టర్ గురించి మాట్లాడుకున్నారు జనం. అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ నిర్మించారు.